×
క్లుప్తంగా ప్రవక్త ఈసా అలైహిస్సలాం ఎలా సృష్టించబడినారో తెలుపండి

    ఈసా అలైహిస్సలాం ఎలా సృష్టించబడినారు?

    ]తెలుగు – Telugu – تلغو [

    షేఖ్ ముహమ్మద్ సాలిహ్ అల్ మునజ్జిద్

    అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్

    రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్

    2012 - 1434

    كيف تمّ خلْق عيسى عليه السلام

    « باللغة تلغو »

    فضيلة الشيخ محمد صالح المنجد

    ترجمة:محمد كريم الله

    مراجعة:شيخ نذير أحمد

    2012 - 1434

    ఈసా అలైహిస్సలాం ఎలా సృష్టించబడినారో వివరించండి?

    ఈసా అలైహిస్సలాం ఎలా సృష్టించబడినారో తెలుపండి ?

    అల్హందులిల్లాహ్ – సకల స్తోత్రములు మరియు కృతజ్ఞతలు అల్లాహ్ కే.

    మర్యమ్ ధరించి ఉన్న చొక్కా మెడ వద్ద ఊదమని అల్లాహ్ జిబ్రయీల్ అలైహిస్సలాంను ఆజ్ఞాపిచినాడు. అల్లాహ్ ఆజ్ఞతో అది మర్యమ్ యొక్క గర్భసంచిలో ప్రవేశించింది. తద్వారా అది అల్లాహ్ సృష్టించిన ఒక ఆత్మగా మారింది. దీని గురించి అల్లాహ్ యొక్క పలుకులు ఇలా ఉన్నాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

    “మరియు తన శీలాన్ని కాపాడుకుంటూ ఉన్న ఆమె (చొక్కా)లో మేము (జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా) ఊదాము" [al-Anbiya' 21:91]

    తర్వాత ఆ రూహ్ ఆమె గర్భసంచిలో చేరిందని అల్లాహ్ ఇలా పేర్కొన్నాడు (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

    “మరియు ఇమ్రాన్ కుమార్తె అయిన మర్యమ్ తన శీలాన్ని కాపాడుకుంటూ వచ్చింది. మేము మా రూహ్ (జిబ్రయీల్ అలైహిస్సలాం) ద్వారా ఆమెలో (చొక్కాలో) ఊదాము.". [అత్తహ్రీమ్ 66:12]

    అల్లాహ్ యొక్క ఆజ్ఞలను తు.చ. తప్పకు శిరసావహించే జిబ్రయీల్ అలైహిస్సలాం యే ఆమెలో ఊదినారనే విషయం ఈ క్రింది ఆయతులో సూచించబడింది. (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

    “దైవదూత ఇలా అన్నది: 'నేను కేవలం నీ ప్రభువు వద్ద నుండి 'నీకు ఒక సజ్జనుడైన కుమారుడు జన్మించబోతున్నాడనే' శుభవార్తను తెలుపడానికి పంపబడిన ఒక సందేశహరుడిని మాత్రమే.'" [మర్యమ్ 19:19]

    కొన్ని సెకన్ల సమయం వరకే ఆమె గర్భం దాల్చిందనే కొందరు ముఫస్సిరీన్ (ఖుర్ఆన్ ఆయతులను వివరించే పండితులు) ల అభిప్రాయం కొన్ని వివరణలలో పేర్కొనబడింది. అయితే ఇది స్పష్టంగా ఖుర్ఆన్ లేదా సున్నతులలో సూచించబడలేదు. ఒకవేళ అలానే సంభవించి ఉండినట్లయితే, అది స్వయంగా ఒక మహిమ అయి ఉండేది. అది సాధారణంగా స్త్రీలు దాల్చే గర్భం వంటిది కాకపోవడం వలన ప్రజలు వెంటనే ఈసా అలైహిస్సలాం ను స్వీకరించేవారు మరియు ఆమెపై వ్యభిచారపు నింద మోపేవారు కాదు. దీని గురించి ఖుర్ఆన్ లో ఇలా తెలుపబడింది. (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

    “ఓ మర్యమ్! నిశ్చయంగా నీవు ఒక ఫరియ్య్ (బరువైనదాన్ని) తీసుకు వచ్చావు" [మర్యమ్ 19:27]

    ఇద్దరు ప్రసిద్ధ ముఫశ్శిర్ ల వివరణ ఇక్కడ పేర్కొంటున్నాము. వారిలో ఒకరు ప్రాచీన కాలం నుండి ప్రసిద్ధి చెందిన ఇబ్నె కథీర్. మరొకరు ఈ మధ్య కాలానికి చెందిన అల్ షంఖీతి. అల్లాహ్ వారిద్దరిపై దయ జూపు గాక.

    ఇమామ్ ఇబ్నె కథీర్ ఇలా వివరించారు:

    ఈసా అలైహిస్సలాం గర్భంలో ఎంత కాలం ఉండినారనే విషయం గురించి ముఫశ్శిర్ ల మధ్య భేదాభిప్రాయం ఉంది. బాగా ప్రసిద్ధి చెందిన అభిప్రాయం ఏమిటంటే, ఈసా అలైహిస్సలాం దాదాపు తొమ్మిది నెలల పాటు ఆమె గర్భంలో ఉండినారు.… ఇబ్నె జురైజ్ ఇలా పలికినాడు: ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా మర్యమ్ అలైహిస్సలాం యొక్క గర్భకాలం గురించి ఎవరో ప్రశ్నించగా, ఆయనిచ్చిన జవాబును విన్న ఉత్బహ్ ఇబ్నె అబ్దుల్లాహ్ అత్తఖాఫీ దానిని అల్ ముగీరహ్ కు తెలుపగా, దానిని అల్ ముగీరహ్ నాకిలా అందజేసినాడు: ఆమె గర్భం దాల్చిన వెంటనే ప్రసవించింది!

    ఇది ఒక వింతగా ఉంది. ఈ ఆయతు యొక్క బహిరంగ భావం పై ఇది ఆధాపడి ఉందనిపిస్తున్నది (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

    “అపుడు ఆమె గర్భం దాల్చింది, దూర ప్రాంతాలకు వెళ్ళిపోయింది. ప్రసవ నొప్పులు ఆమెను ఒక ఖర్జురపు చెట్టు దగ్గరికి తరిమాయి." [మర్యమ్ 19:22].

    ఇక్కడ వాడబడిన “ఫ" అనే పదపూర్వ అక్షరం, [ ఫ అజాహా అల్ మఖ్దాద్ పద సమూహంలోని – మరియు ప్రసవ నొప్పులు ఆమెను తరిమాయి] సంఘటనల పరంపరను సూచిస్తున్నది. కానీ, ఆ ఘటనలు ఒకదాని తర్వాత మరొకటి తగిన సమయంలో వాటి స్వంత లక్షణాలకు అనుగుణంగా జరుగుతాయి. దీని గురించిన ఆయతు (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

    “మరియు నిశ్చయంగా మేము మానవుడిని బంకమన్ను నుండి సృష్టించాము. తర్వాత అతడిని నుత్ఫా (స్త్రీపురుషుల కలయిన నుండి ఆవిర్భవించే ఒక బిందువు) గా చేసాము. తర్వాత ఆ నుత్ఫాను మేము ఒక రక్తపు ముద్దగా చేసాము. తర్వాత ఆ రక్తపుముద్దను ఒక మాంసపు కండగా చేసాము. తర్వాత దాని నుండి మేము ఎముకలను తయారు చేసాము." [అల్ మోమినూన్ 23:12]

    ఇక్కడ 'ఫ' ['తర్వాత' అని అనువదించబడింది] అనే అక్షరం సంఘటనల పరంపరను వాటి వాటి స్వంత లక్షణాలకు అనుగుణంగా జరగడాన్ని సూచిస్తున్నది. సహీహైన్ (బుఖారీ మరియు ముస్లిం హదీథు గ్రంథాలు) లలో “ఒక దశకు మరొక దశకు మధ్య ఉండే వ్యవధి 40 రోజులని." పేర్కొనబడింది.

    మరియు అల్లాహ్ పలుకులు (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

    “ఆకాశం నుండి నీటిని క్రిందికి పంపడాన్ని, తర్వాత (ఫ) భూమి పచ్చగా మారిపోడాన్ని నీవు చూడటం లేదు?" [అల్ హజ్ 22:63].

    అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు – అయినా బహిరంగ అర్థాన్ని బట్టి తెలుస్తున్న దేమిటంటే మర్యమ్ ఇతర మహిళల వలే గర్భకాలాన్ని పూర్తి చేసింది.… ప్రజలలో తన గురించి అనుమానాలు బయలుదేరడాన్ని పసిగట్టిన తర్వాత, ఆమె వారి నుండి దూరంగా వెళ్ళిపోయింది “దూరపు పాంతానికి" [మర్యమ్ 19:22], i.e. వారికి దూరంగా – వారి దృష్టిలో ఆమె పడకుండా మరియు ఆమె దృష్టిలో వారు పడకుండా ఉండేందుకు.… వారి నుండి ఆమె దాగు కున్నది మరియు వారి నుండి ఆమె “ఒక పరదా ఉంచింది" [మర్యమ్ 19:17 – (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం)]. అలా ఆమెను ఎవరూ చూడలేరు మరియు ఆమె ఎవరినీ చూడలేదు. (తఫ్సీర్ ఇబ్నె కథీర్, 3/122).

    షేఖ్ అల్ షంఖతీ ఇలా వివరించారు:

    ఈసా అలైహిస్సలాం ఎంత కాలం మర్యమ్ గర్భంలో ఉండినారనే విషయం గురించి పండితుల అభిప్రాయాలన్నింటినీ మేము ఇక్కడ పేర్కొనడం లేదు. ఎందుకంటే, వాటిలో కొన్నింటి సాక్ష్యాధారాలు సరిగ్గా లేవు. పండితుల అభిప్రాయాలన్నింటిలో బలమైన అభిప్రాయం ఏమిటంటే, అల్లాహ్ యొక్క అత్యద్భుత మహిమతో గర్భం మొదలైనా, ఆమె ఇతర స్త్రీలకు మాదిరిగానే గర్భకాలాన్ని పూర్తి చేసింది. అసలైన విషయం అల్లాహ్ యే ఎరుగును. (అద్వా అల్ బయాన్, 4/264)

    కొందరు అజ్ఞానులు ఈ ఆయతు భావార్థాన్ని ఇలా పేర్కొంటారు (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

    “ఎపుడైతే నేను ఆయన రూపాన్ని తయారు చేసానో, దానిలో ఆత్మను ఊదినానో, అపుడు ఆ ఆత్మ నా ద్వారా సృష్టించబడింది" [సాద్ 38:72] అనే ఆయతు భావార్ధాన్ని, మసీహ్ అల్లాహ్ యొక్క రూహ్ లోని భాగంగా పేర్కొంటారు. (అల్లాహ్ వారికి సన్మార్గం చూపుగాక)

    [ఇక్కడి అసలు అరబీ పదం 'మిన్ రూహి' అంటే 'నా రూహ్ లో నుండి' అని అర్థం]

    ఇబ్నె అల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ ఆయతు యొక్క ఈ భావానువాదం దారి తప్పించేలా ఉందని ఇలా పేర్కొన్నారు:

    ఈ క్రింది ఆయతు యొక్క షష్ఠీ విభక్తి (జెనెటివ్ లేక పొసెసివ్) పదనిర్మాణం యొక్క తప్పుడు భావానువాదం (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

    “ఎపుడైతే నేను ఆయన రూపాన్ని తయారు చేసానో, దానిలో ఆత్మను ఊదినానో, అపుడు ఆ ఆత్మ నా ద్వారా సృష్టించబడింది" [సాద్ 38:72] – అల్లాహ్ పేరుతో ఇలాంటి పదనిర్మాణం వచ్చినపుడు, అది క్రింది రెండింటిలో ఒక దానిని సూచిస్తుందనేది మనం తెలుసుకోవాలి:

    (మొదటిది) తమకు తాముగా నిలబడలేని జ్ఞానం, శక్తి, పలుకులు, వినడం, చూడడం వంటి లక్షణాలు, గుణగణాలు. ఇక్కడ ఒక లక్షణం షష్ఠీవిభక్తి (జెనెటివ్) పదనిర్మాణంలో 'అలాంటి లక్షణం వర్తించే వానికి' చేర్చబడింది. అంటే, అతని జ్ఞానం, అతని శక్తి, అతని పలుకులు, అతని వినడం, అతని చూపు, అతని జీవితం మొదలైనవన్నీ 'అతని' లక్షణాలు లేక గుణగణాలు. ఇవి స్వయంగా సృష్టించబడినవి కావు. (ఎందుకంటే ఇవన్నీ 'అతని' లక్షణాల్ని సూచిస్తున్నాయి); అతని ముఖం, అతని చేయి మొదలైన పదాలకు కూడా ఇదే వివరణ వర్తిస్తుంది.

    (రెండోది) స్వంతంగా ఉనికిలో ఉండగలిగే విషయాలను షష్ఠివిభక్తి పదనిర్మాణంలో పేర్కొనడం, ఉదాహరణకు – అతని ఇల్లు, అతని ఒంటె, అతని బానిస, అతని సందేశహరుడు, అతని ఆత్మ. ఇక్కడ సృష్టితం షష్ఠివిభక్తి పదనిర్మాణం ద్వారా దాని సృష్టికర్తకు చేర్చబడింది. కానీ, ఇలా పేర్కొనబడటంలో, ఆ విషయం ఒక విశిష్ఠమైనదిగా, గౌరవప్రదానమైనదిగా మరియు ఇతరుల కంటే భిన్నమైనదిగా తీసుకోబడుతుంది. ఉదాహరణకు, అల్లాహ్ యొక్క గృహం (కాబాగృహం) – ఇళ్ళన్నీ అల్లాహ్ కే చెందినవి కదా. అల్లాహ్ యొక్క ఆడ ఒంటె – ఒంటెలన్నీ అల్లాహ్ కే చెందినవి కదా. అవన్నీ ఆయన ద్వారానే కదా సృష్టించబడినాయి. ఇక్కడి షష్ఠీభక్తికి ఆయన యొక్క దివ్యత్వంతో సంబంధం ఉంది – దీనర్థంలో ఆయన వాటిని ఎక్కువగా ఇష్టపడతాడు మరియు గౌరవిస్తాడు అని వస్తుంది. దీనికి విభిన్నంగా, మామూలుగా షష్ఠీవిభక్తి (ఇదాఫా) ఆయన యొక్క సార్వభౌమత్వంతో జతబడి ఉంది – ఆయన సృష్టించాడు, ఆయన తయారు చేసాడు... కాబట్టి, మామూలు ఇదాఫా పదనిర్మాణంలో ఆయనే దాని సృష్టికర్త అనేది సూచించబడగా, ప్రత్యేక ఇదాఫా పదనిర్మాణంలో అల్లాహ్ దానిని ఎంచుకున్నాడనే అర్థం సూచించబడుతుంది. తాను తలిచిన దానిని అల్లాహ్ సృష్టిస్తాడు. సృష్టిలో నుండి తాను తలిచిన వాటిని ఎంచుకుంటాడు. (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

    “మరియు తను తలిచిన దానిని మీ ప్రభువు సృష్టిస్తాడు మరియు ఎంచుకుంటాడు" [అల్ ఖసస్ 28:68]

    కాబట్టి, ఇక్కడ మిన్ రూహి (భాషాపరంగా నా రూహ్), అనే పదసమూహం, ఇదాఫా (షష్టీ విభక్తి, జెనెటివ్) పదనిర్మాణం ప్రత్యేకమైన ఇదాపా పదనిర్మాణం – మామూలు ఇదాపా పదనిర్మాణం కాదు. ఇది అల్లాహ్ యొక్క దివ్యలక్షణాలను సూచించదు. దీనిని ఇలానే అర్థం చేసుకోండి. దీని ద్వారా మీరు అల్లాహ్ అనుజ్ఞతో ప్రజలు చేసే అనేక తప్పులు నుండి బయట పడగలుగుతారు.

    (అల్ రూహ్, p. 154, 155)

    ముగింపుగా, ఈసా అలైహిస్సలాంను అల్లాహ్ యొక్క ఆత్మగా వివరించడమనేది ఈసా అలైహిస్సలాంను గౌరవించడం క్రిందికి వస్తుంది. ఇలాంటి ఇదాఫా (షష్ఠీవిభక్తి) పదనిర్మాణం (రూహ్ అనే పదం అల్లాహ్ పేరుతో ఇదాఫా (షష్టీవిభక్తి జెనెటివ్) పద్దతిలో చేర్చబడింది) లక్షణం వివరించబడిన వానికే ఆ లక్షణం ఆపాదించబడుతుందని సూచించదు - “అల్లాహ్ యొక్క చేయి", “అల్లాహ్ యొక్క ముఖం" వంటి పదాల విషయంలో వలే కాకుండా. దీనికి భిన్నంగా, ఒక సృష్టితం దాని సృష్టికర్తకు చెందుతుందని ఇదాఫా పదనిర్మాణంలో సూచించబడుతుంది. ఉదాహరణకు కాబా – అల్లాహ్ యొక్క గృహంగా పేర్కొనబడింది, అలాగే ఆడ ఒంటె - సాలిహ్ అలైహిస్సలాంకు అల్లాహ్ ప్రసాదించిన ఒక మహిమ అది. ఆ ఆడ ఒంటె అల్లాహ్ యొక్క ఆడ ఒంటెగా పేర్కొనబడింది.

    సర్వం అల్లాహ్ యే ఎరుగును.

    షేఖ్ ముహమ్మద్ సాలిహ్ అల్ మునజ్జిద్.