×
ఈ వ్యాసంలో లైలతుల్ ఖదర్ గురించి క్లుప్తమైన వివరణ ఉన్నది.

 ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (ఖుర్ఆన్ వచన భావానికి అనువాదం): “మేము దీన్ని (ఖుర్ఆన్ ని) ఘనమయిన రాత్రిన అవతరింపజేశాము. ఘనమయిన రాత్రి గురించి మీకేం తెలుసు? ఘనమయిన రాత్రి వేయి నెలలకంటే కూడా శ్రేష్టమయినది”.97:1-3

 అల్లాహ్ యొక్క అనుమతితో, అనుజ్ఞతో దైవదూతలు మరియు జిబ్రయీల్ అలైహిస్సలాం, ఆ రాత్రి భూమిపైకి దిగివస్తారు. ఆ రాత్రి శాంతియుతమయినది శుభోదయం. ఏడాది మొత్తంలో శుభప్రదమైనది రమదాన్ నెల కాగా, రమదాన్ నెలలో అత్యంత విలువైన మరియు పుణ్య ప్రదమైన రేయి ‘లైలతుల్ ఖదర్’ రేయి. అది రమదాన్ నెల చివరి 10 బేసి రాత్రులలో అంటే 21, 23, 25, 27 లేదా 29లలో ఏదో ఒక రేయి కావచ్చు. ఆ రేయినీ అన్వేషించి, దాన్ని పొంది పశ్చాత్తాప భావంతో అల్లాహ్ ను వేడుకుంటూ గడిపిన వ్యక్తీ నిజంగా ధన్యుడు. అతని గత అపరాధాలన్నీ మన్నించబడతాయి. ‘కారుణ్య ప్రదాయిని అయిన ఆ రేయిని పొందీ, దాన్ని పోగొట్టుకున్న వాడిని మించిన దౌర్భాగ్యుడు మరోకడుండడు’ అని మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాల ద్వారా తెలుస్తోంది.

ఒక హదీసులో ఉంది “మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని హజ్రత్ అబుహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “ఎవరయితే విశ్వాసంతో మరియు పుణ్య ఫలా పేక్షతో షబెఖద్ర్ (ఘనమయిన రాత్రి) నందు దైవారాధనలో గడిపాడో అతని వలన జరిగిన పాపాలు, జరగబోయే పాపాలు క్షమించబడతాయి.”

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖించారు: నేను మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అడిగాను: “ఓ దైవ ప్రవక్తా ! నేను గనుక ఘనమైన రాత్రిని పొందితే ఏమని ప్రార్థించను?” దానికి ఆయన ఇలా ఉపదేశించారు “అల్లాహుమ్మ ఇననక అఫువ్వున్ తుహిబ్బుల్ ఆఫ్వ ఫాఫు అన్నీ(ఓ అల్లాహ్, నువ్వు క్షమించేవాడవు. క్షమించటాన్ని నువ్వు ఇష్టపడతావు. కనుక నన్ను క్షమించు”. అని వేడుకో)

ఏ ఏ రాత్రుల్లో అన్వేషించాలి?

అంతటి సుభాప్రదమయిన ఆ రేయి, కారుణ్య ప్రభువు తరపునుండి కదలి వచ్చిన ఆ కరుణా సాగర రమదాన్ మాసంలోని ఏ రాత్రిలో అయి వుంటుంది? అన్నది ఖచ్చితంగా నిర్ధారించబడలేదు. దాని మర్మం, దాని పరమార్థం సర్వలోక ప్రభువైన అల్లాహ్ కే బాగా తెలుసు! అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సైతం, అది ఫలానా రాత్రి అనే ఖచ్చితమైన విషయం తెలియజేయబడలేదు. అయితే రమదాన్ నెలలోని చివరి ఐదు బేసి రాత్రుల్లో ఆ శుభప్రదమైన రాత్రిని వెతకమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించి నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. బేసి రాత్రులలో ఏదై ఉంటుందనే విషయమై వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. అయితే 27వ రాత్రి లైలతుల్ ఖద్ర్ కావటానికి ఎక్కువ ఆస్కారం ఉందని ప్రవక్త సహచరుల అభిప్రాయాన్ని బట్టి తెలుస్తోంది. ఒక హదీసులో ఇలా ఉంది - ఎవరయితే రమదాన్ మాసం అంతా క్రమం తప్పకుండా మగ్రిబ్, ఇషా నమాజులను సామూహికంగా చేశారో, వారు లైలతుల్ ఖద్ర్ యొక్క ఒక పెద్ద భాగాన్ని పొందారు.

పై హదీసు పై వ్యాఖ్యానిస్తూ కొంతమంది ఇస్లామీయ విద్వాంసులు, ఈఘనమైన రాత్రి ఆ నెల మొత్తంలో ఎప్పుడయినా ఆసన్నం కావచ్చు గనక నిత్యం దైవారాధనలో గడపాలని అన్నారు. అయితే, రమదాన్ నెలలోని చివరి అయిదు బేసి రాత్రుల్లో లైలతుల్ ఖద్ర్ ను పొందేందుకు ప్రయత్నించమనే విషయం బలమయిన హదీసుల ద్వారా నిర్దారితమవుతోంది. ‘ఇంతటి శ్రేష్టమైన రేయి ఫలానా తేదీన అవతరిస్తుందని విశ్వప్రభువు స్పష్టంగా ఎందుకు తెలియజేయలేదు?’ అనే సందేహం మనకు ఎప్పుడైనా కలుగవచ్చు. ఆ రాత్రిని అన్వేషించే ప్రయత్నంలో తన దాసులు వీలైనంత ఎక్కువగా ఆరాధనలలో గడపాలని, తమ పాపాల క్షమాపణ కోసం మరింత అధికంగా వారు వేడుకోవాలన్నది అపార కృపాశీలుడైన అల్లాహ్ యొక్క ఉద్దేశ్యం కావచ్చు! సాటిలేని కరుణామయుడాయన!!

ముస్లిములకు మనవి: ముస్లిం సమాజం ఒక ముఖ్యవిషయాన్ని గమనించాలి. లైలతుల్ ఖద్ర్ ను సద్వినియోగం చేసులోవాలన్నదే వారి లక్ష్యం కావాలి. అయితే మస్జిదులకు విద్యుద్దీపాలు అలంకరించి, ఏదో ఉబుసుపోక కాలక్షేపానికి వచ్చినట్లు వచ్చి, కాస్పేపు కబుర్లు చెప్పుకొని చల్లగా ఇంటికి వెళ్ళేవారు కొందరున్నారు. మిటాయిలు, చాయిల కోసం కాస్సేపు మేల్కొని ఆ తతంగం కాస్తా ముగియగానే నిశ్చింతగా ఇంటి దారిపట్టే మహానుభావులూ ఉన్నారు. ఆ రాత్రి తెల్లవారు ఝాము వరకు దైవారాధనలో గడిపి ఫజ్ర్ నమాజులో మాయమై పోయే ప్రబుద్ధులూ ఉన్నారు. అలాంటి వారందరికీ ఓ మనవి - లైలతుల్ ఖద్ర్ ప్రాముఖ్యతను వారు గుర్తించాలి. నిస్సందేహంగా అల్లాహ్ ఎంతో క్షమాగుణం గలవాడు మరియు క్షమించటాన్ని ఆయన ఎంతో ఇష్టపడతాడు. తన దాసుల అపరాధాలను ఆయన ఎంతో దయతో క్షమిస్తాడు .

అయితే ఏడాది అంతా దైవాదేసాలను ధిక్కరించి, ఇష్టారాజ్యం చేసి, అపసవ్యమైన, వ్యర్థమైన ప్రలాపనలకు పాల్పడి ఏడాదికొకసారి, ఒకే రాత్రిన తమ ప్రభువు సన్నిధికి వచ్చి పాపాల ప్రక్షాళన చేయమని అడగటం శుద్ధ అవివేకమే కాగలదు. ఎందుకంటే ఏడాదికోసారి అన్నం తిని మనం బ్రతకగాలమా?

ఆ రేయి, పశ్చాత్తాపభావంతో కుమిలిపోయి, ఇక పై నుండి దుష్కార్యాలకూ, అన్ని రకాల చెడులకూ దూరంగా ఉంటానని గట్టిగా నిశ్చయించుకుని, తన మాటను నిలబెట్టుకునే దాసులనే సర్వోన్నత ప్రభువైన అల్లాహ్ ఇష్టపడతాడు. అల్లాహ్ మనందరికీ ఆ రాత్రి యొక్క శుభాలు పొందే అవకాశం ప్రసాదించుగాక!