×
పవిత్ర ముహర్రం నెల మరియు ఆషూరాహ్ దినపు ప్రత్యేక శుభాలు

    బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం

    ఇస్లాంలో ముహర్రం & ఆషురాహ్ యొక్క పవిత్రస్థానం

    అత్యంత పవిత్రమైన నెలలలో ఒకటైన ముహర్రం నెల త్వరలో మన ముందుకు రాబోతున్నది. ఇటువంటి శుభప్రదమైన నెలలో ఎక్కువ పుణ్యాలు సంపాదించిపెట్టే మంచిపనుల గురించి ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవలెను. దీని ద్వారా వారు తమ ఉన్నత స్థితిని మరింతగా అభివృద్ధి పరచుకోవటానికి, చేసిన పాపాలను క్షమింప జేసుకోవటానికి మరియు అల్లాహ్ మెప్పును పొందటానికి ప్రయత్నించేందుకు ఇది ఒక మంచి అవకాశం. అలాగే కొందరు ముస్లింలు తమ తమ విశ్వాసాలలో మరియు ఆచరణలలో ఇస్లాం ధర్మానికే వ్యతిరేకమైన నూతన కల్పితాలను మరియు క్రొత్త, క్రొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇటువంటి ఆచరణలను అల్లాహ్ స్వీకరిస్తాడనే భ్రమలో పడి ఖుర్ఆన్ మరియు సున్నత్ ల ద్వారా అల్లాహ్ స్వయంగా ఆజ్ఞాపించిన సరైన జీవనవిధానానికి దూరమౌతున్నారు. తాతముత్తాతల నుండి వంశపారంపర్యంగా వస్తున్న ఆచారమనే సాకుతో వాటిని గ్రుడ్డిగా అనుసరించక, ప్రతి ఒక్కరు వాటిలోని నిజానిజాలను నిజాయితీతో పరిశోధించవలెను. దీని ద్వారా వారు స్వయంగా తమ తమ ఆరాధనలను సరిదిద్దుకోవటమే కాకుండా ఇతరులకు కూడా సరైన దారి చూపినవారవుతారు. ఈ లక్ష్యసాధనకు సహాయపడే, ప్రయోజనకరమైన కొన్ని ముఖ్యవిషయాలను ఇక్కడ మీకందరికీ అందజేస్తున్నాము.

    పవిత్ర ముహర్రం నెలతో ముస్లింల చాంద్రమాన హిజ్రీ క్యాలెండర్ ప్రారంభమవుతుంది. దివ్యఖుర్ఆన్ లో తెలుపబడిన నాలుగు పుణ్యమాసాలలో ఇది ఒకటి. ఇదే విషయాన్ని దివ్యఖుర్ఆన్ (అత్తౌబా అధ్యాయం 9:36వ వచనం) ఇలా ప్రకటిస్తున్నది. "నిశ్చయంగా అల్లాహ్ దగ్గర నెలల సంఖ్య కేవలం 12 మాత్రమే. ఇది భూమ్యాకాశాలు సృష్టించిన దినం నుండి అల్లాహ్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. వాటిలో నాలుగు నిషిద్ధమైనవి."

    ప్రవక్త శల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ఆధారంగా ఇవి 11వ నెల దుల్ ఖాయిదా, 12వ నెల దుల్ హజ్జ్, 1వ నెల ముహర్రం & 6వ నెల రజబ్. అల్లాహ్ యొక్క ప్రవక్త శల్లల్లాహు అలైహి వసల్లం తమ అంతిమ హజ్ యాత్రా ప్రసంగంలో చేసిన క్రింది ప్రకటన ఆధారంగా ఖుర్ఆన్ వ్యాఖ్యాతకర్తలందరూ దీనిపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరచారు - "ఒక్కో సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. వీటిలో 4నెలలు పవిత్రమైన నిషిద్ధమాసాలు మూడు ఒకే వరుసలో ఉన్న దుల్ ఖాయిదా,దుల్ హజ్,ముహర్రం & నాలుగవది రజబ్"

    వీటినే ప్రత్యేకంగా పేర్కొనబడిన కారణంగా ‘మిగిలిన నెలలు అంతగా పవిత్రమైనవి కావు’ అని భావించకూడదు. ఎందుకంటే రమదాన్ నెల, మొత్తం సంవత్సరంలోనే అత్యంత పవిత్రమైనదిగా ప్రకటించబడినది. ఈ 4నెలలను ప్రత్యేకంగా పేర్కొనటానికి కారణం, పూర్వం నుండీ మక్కా బహుదైవారాధకులు కూడా వీటి పవిత్రతను అంగీకరించి ఉండటం

    వాస్తవంగా, ఈ 12 నెలలు ఎటువంటి తేడాలు లేకుండా, పరస్పరం ఒకదానితో మరొకటి సమానమైనవే. మిగిలిన వాటిని వదిలి, ఏదో ఒక నెలకు మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వవలసిన సహజమైన పవిత్రత, ప్రత్యేకత ఏ నెలకూ లేదు. అయితే ఫలానా నెల పవిత్రమైన నెల అనే గుర్తింపు ఎందుకు ఇవ్వబడినది? దీనికి సమాధానం - ఏ ప్రత్యేక సమయాన్నైతే అల్లాహ్ తన విశేషమైన దీవెనలు కురిపించటానికి ఎన్నుకున్నాడో, ఆ ప్రత్యేకమైన సమయమే ఆయన కారుణ్యం వలన ఎక్కువ ప్రాధాన్యత గల పవిత్రమైన సమయంగా సూచించబడినది.

    అదే విధంగా ప్రవక్త ఇబ్రాహీం (అబ్రహాం) అలైహిస్సలాం కాలం నుండే ఈ నాలుగు నెలల పవిత్రత గుర్తించబడినది. మక్కానగర బహుదైవారాధకులు తమను తాము ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం అనుచరులుగా భావించటం వలన, వారు కూడా ఈ నాలుగు నెలలను పవిత్రమైన నెలలుగా భావించేవారు. అక్కడి వివిధ తెగల మధ్య తరచుగా జరిగే యుద్ధాలను కూడా వారు ఈ పవిత్ర నెలలలో ఆపివేసేవారు.

    అయితే అంతిమ ప్రవక్త ముహమ్మద్ (శల్లల్లాహు అలైహి వసల్లమ్) జీవనవిధానం (షరియత్)లో వీటి పవిత్రస్థానం మరల పున:ప్రకటించబడినది. దివ్యఖుర్ఆన్ కూడా వీటిని “పరిశుద్ధమైన నెలలు” గా ప్రకటించినది.

    ఈ నెలలో ఉపవాసం ఉండటం

    ముహర్రం నెల యొక్క కొన్ని ప్రత్యేక విశేషగుణాలు:- ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (శల్లల్లాహు అలైహి వసల్లమ్) ఇలా ప్రకటించారు: “రమదాన్ నెల ఉపవాసాల తర్వాత, అత్యంత ఉత్తమమైనవి ముహర్రం నెల ఉపవాసాలు”

    ముహర్రం నెలలోని ఉపవాసాలు తప్పనిసరి కానప్పటికీ, ఐచ్ఛికంగా అంటే స్వయంగా తనకు తాను ఈ పవిత్రదినాలలో ఉపవాసం ఉండటం వలన, అల్లాహ్ యొక్క ప్రత్యేక కారుణ్యం, దీవెనలు పొందటానికి అవకాశమున్నది. పై హదీథ్ ద్వారా ముహర్రం నెల ఉపవాసాలకు మిగిలిన ఇచ్ఛాపూర్వక (నఫిల్) ఉపవాసాల కంటే ఎన్నోరెట్లు అధికంగా పుణ్యాలు లభించును.

    ముహర్రం నెల ఉపవాసాలకు ప్రతిఫలంగా ప్రసాదించబడే పుణ్యాలు, నెల మొత్తం ఉపవాసం ఉంటేనే లభిస్తాయని భావించటం సరైనది కాదు. అలాగే ఈ నెలలో ఉండే ప్రతి ఒక్క ఉపవాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. కాబట్టి వీలయినంత ఎక్కువగా ఈ అవకాశాన్ని వినియోగించు కోవటానికి ప్రయత్నించవలెను.

    'ఆఁషురాహ్' పవిత్ర దినం

    ముహర్రం నెల మొత్తం పవిత్రమైనదే అయినప్పటికీ ప్రత్యేకంగా 10వ తేదీ మిగిలిన దినాల కంటే ఎక్కువ పవిత్రమైనదిగా పేర్కొనబడినది. ఈ పవిత్ర దినాన్ని ‘ఆఁషురాహ్’ అని పిలుస్తారు. ప్రవక్త ముహమ్మద్ (శల్లల్లాహు అలైహి వసల్లమ్) సహచరుడైన ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త (శల్లల్లాహు అలైహి వసల్లమ్) మదీనా పట్టణానికి వలస వెళ్ళిన తర్వాత, అక్కడి యూదులు ముహర్రం నెల 10వ తేదీన ఉపవాసం ఉండటం గమనించి, వారిని కారణం అడిగినారు. దానికి వారు ‘అల్లాహ్ అదే రోజు ప్రవక్త మూసా అలైహిస్సలాంను మరియు వారి సహచరులను తన మహత్యం ద్వారా క్షేమంగా నదిని దాటించాడు. మరియు ఫిరౌన్ ను అదే నీళ్ళలో ముంచివేసినాడు’ అని జవాబిచ్చినారు. యూదుల నుండి ఇది విని ప్రవక్త (శల్లల్లాహు అలైహి వసల్లమ్) "మేము మూసా అలైహిస్సలాంకు మీకంటే ఎక్కువ దగ్గరి వాళ్ళం" అని పలికి, ముస్లింలను కూడా ఆఁషురాహ్ దినమున ఉపవాసం ఉండమని ప్రోత్సహించారు.(అబుదావూద్ హదీథ్ గ్రంథం)

    ప్రవక్తగా ముహమ్మద్ (శల్లల్లాహు అలైహి వసల్లమ్) నియమించబడిన తొలిదినాలలో, ముస్లింలపై ఆఁషురాహ్ దినపు ఉపవాసం తప్పనిసరైనదిగా ఉండేదనే విషయం అనేక హదీథ్ ల ద్వారా స్పష్టమవుతున్నది. కాని ఆ తర్వాతి కాలంలో అల్లాహ్ ఆదేశానుశారం రమదాన్ నెల ఉపవాసాలు తప్పనిసరిగా చేయబడినవి మరియు ఆఁషూరాహ్ దినపు ఉపవాసం ఐచ్ఛికమైన (తమ ఇష్టానుసారం ఉండే) నఫిల్ ఉపవాసంగా మార్చబడినది. ఆయెషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన ప్రకారం - ప్రవక్త (శల్లల్లాహు అలైహి వసల్లమ్) మదీనా వచ్చిన తర్వాత ఆఁషూరాహ్ పవిత్ర దినమున వారు స్వయంగా ఉపవాసం ఉండేవారు మరియు ఇతరులను కూడా ఉపవాసం ఉండమని సూచించేవారు. కాని ఆ తర్వాత రమదాన్ నెల ఉపవాసాలు తప్పనిసరి అని ప్రకటించిన తర్వాత, విధి ఉపవాసాలు అంటే తప్పనిసరి ఉపవాసాలు కేవలం రమదాన్ నెలకే పరిమితం అయ్యాయి మరియు ఆఁషురాహ్ ఉపవాసం పై నుండి ‘తప్పని సరి’ అనే ఆదేశం తొలిగించబడినది.. కాబట్టి ఆఁషూరాహ్ పవిత్ర దినమున తమ తమ ఇష్టానుసారం ఉపవాసం ఉండవచ్చు లేదా ఉపవాసం ఉండకపోవచ్చు. (అబు దావుద్ హదీథ్ గ్రంథం)

    ‘రమదాన్ నెల ఉపవాసాలు తప్పనిసరి’ అని ప్రకటింపబడిన తర్వాత కూడా ప్రవక్త (శల్లల్లాహు అలైహి వసల్లమ్) ఆఁషురాహ్ దినమున ఉపవాసం ఉండేవారు. ఇదే విషయాన్ని అబ్దుల్లాహ్ ఇబ్నె మూసా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు - "ప్రవక్త (శల్లల్లాహు అలైహి వసల్లమ్) ఆఁషురాహ్ దినపు ఉపవాసమునకు ఇతర దినముల ఉపవాసము కంటే ఎక్కువ ఆధిక్యతనిచ్చేవారు మరియు రమదాన్ నెల ఉపవాసములకు ఆఁషురాహ్ ఉపవాసం కంటే ఎక్కువ ఆధిక్యతనిచ్చేవారు.” (బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు)

    క్లుప్తంగా, అనేక హదీథ్ ల ద్వారా ప్రవక్త (శల్లల్లాహు అలైహి వసల్లమ్) జీవన విధానం (సున్నత్) లోని ఆఁషురాహ్ దినపు ఉపవాసం యొక్క ప్రాధాన్యత మరియు దాని ద్వారా ఎక్కువ పుణ్యాలు పొందగలిగే అవకాశాల గురించి ఋజువు అయినది. ఇంకో హదీథ్ ఆధారంగా ఆఁషురాహ్ తో పాటు ముందు రోజు గాని లేదా తర్వాత రోజు గాని ఉపవాసం ఉండటం ఉత్తమమని తెలుపబడినది. అంటే రెండు రోజులు ఉపవాసం ఉండవలసి ఉన్నది - ముహర్రం 9వ తేదీ మరియు 10వ తేదీ లేదా 10వ తేదీ మరియు 11వ తేదీ. ఒక రోజు ఎక్కువగా ఉపవాసం ఉండటానికి కారణం - ముస్లింల ఉపవాస విధానం యూదులకు భిన్నంగా ఉండవలెననే ప్రవక్త ముహమ్మద్ శల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సూచనయే. యూదులు కేవలం ఆఁషురాహ్ రోజునే ఉపవాసం ఉండేవారు. అందుకని ప్రవక్త ముహమ్మద్ శల్లల్లాహు అలైహి వసల్లం ఆఁషురాహ్ దినపు ఉపవాసంతో పాటు ఇంకో రోజు జతచేయమని బోధించారు. పైన వివరించిన విషయాలన్నీ విశ్వసనీయమైన ఆధారాలతోనే తెలుపబడినవి.

    కొన్ని అపార్థములు మరియు నిరాధారమైన సంప్రదాయములు

    కొందరు అజ్ఞానుల ఆలోచనలలో ఆఁషురాహ్ గురించిన కొన్ని ప్రసిద్ధమైన పరంపరాగత గాథలు (పుక్కింటి పురాణాలు) మరియు అపార్థములు ఎలాగో చోటు చేసుకున్నాయి. అయితే వాటికి ఎటువంటి ఇస్లామీయ మూలాధారాలూ లేవు. వాటిలో కొన్ని - ఈ రోజునే 1. ఆదం అలైహిస్సలాం సృష్టించబడినారు. (x)

    2. ఇబ్రాహీం అలైహిస్సలాం జన్మించారు. (x)

    3. ఆదం అలైహిస్సలాం పశ్చాత్తాపాన్ని, క్షమాపణ అర్థింపును అల్లాహ్ స్వీకరించాడు.(x)

    4. ఈ రోజునే ప్రళయం సంభవించును. (x)

    5. ఈ రోజున ఎవరైతే స్నానం చేస్తారో, వారు జీవితాంతం అనారోగ్యం పాలుకారు. (x)

    పై వాటికీ మరియు ఇదే తరహాలోని ఇతర మోజులకు, పిచ్చి ఊహలకు, నిరాధారమైన భ్రాంతులకు, ఊహా కల్పిత భావనలకు ఎలాంటి ఇస్లామీయ ఆధారాలూ లేవు. ఇంకా ఈ నిరాధారమైన సంప్రదాయాలు ఎలాంటి పుణ్యాన్ని, ఉన్నత స్థానాన్ని ప్రసాదించనూలేవు.

    కొంతమంది ఆఁషురాహ్ రోజున ఒక విధమైన ప్రత్యేక భోజనం తయారు చేయటం సున్నత్ గా తీసుకున్నారు. ఇస్లామీయ మూలసిద్ధాంతాలలో దీనికి కూడా ఎటువంటి ఆధారమూ దొరకదు.

    ఇంకా కొంత మంది ఆఁషురాహ్ పవిత్రతను సిరియా సైన్యంతో జరిగిన యుద్ధంలో షహాదత్ పొందిన సయ్యదినా హుస్సైన్ రదియల్లాహు అన్హు పేరుతో ముడిపెడతారు. నిరభ్యంతరంగా సయ్యదినా హుస్సైన్ రదియల్లాహు అన్హు యొక్క షహాదత్ ఇస్లామీయ చరిత్రలోని అత్యంత బాధాకరమైన సంఘటనలలో ఒకటి. అయినా ఆఁషురాహ్ దినపు పవిత్రతను ఈ షహాదత్ సంఘటనతో ముడి పెట్టలేము. ఎందుకంటే ఆఁషురాహ్ దినం యొక్క ప్రాముఖ్యత, ప్రవక్త (శల్లల్లాహు అలైహి వసల్లమ్) కాలంలోనే స్థాపించబడినది. అయితే సయ్యదినా హుస్సైన్ రదియల్లాహుఅన్హు షహాదత్ సంఘటన చాలా కాలం తర్వాత దాదాపు 60వ హీజ్రీ సంత్సరంలో జరిగినది. ఇంకా సయ్యదినా హుస్సైన్ రదియల్లాహు అన్హు యొక్క ప్రత్యేకతలలో ఒకటిగా, వారి షహాదత్ ఆఁషురాహ్ దినమునే జరిగినది.

    ఇంకో అపవాదు ఏమిటంటే హుస్సైన్ రదియల్లాహు అన్హు షహాదత్ కారణంగా కొందరు దీనిని ఒక దురదృష్టకరమైన నెలగా, ఒక చెడుమాసంగా భావించటం. దీని కారణంగా కొందరు ప్రజలు ఈ నెలలో వివాహాల వంటి శుభకార్యలు చేయరు. ఇది కూడా కేవలం మరొక నిరాధారమైన భావన మాత్రమే. ఇంకా ఇది ఖుర్ఆన్ మరియు సున్నత్ లకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నది. ఎవరైనా ప్రముఖ వ్యక్తి యొక్క మరణం కారణంగా ఏదైనా రోజు దురదృష్టమైనదిగా మారేటట్లయితే, సంవత్సరపు 365 రోజులలో అటువంటి దురదృష్టానికి గురికాని రోజు ఒక్కటి కూడా మనకు కనబడదు. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక సంవత్సరంలో ఎవరో ఒక ప్రముఖ వ్యక్తి మరణం సంభవించే ఉంటుంది. అటువంటి నిరాధారమైన, మూఢవిశ్వాసాల నుండి మనల్ని ఖుర్ఆన్ మరియు ప్రవక్త (శల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క స్వచ్ఛమైన జీవన విధానం (సున్నత్) విముక్తి చేసినది.

    శోకం మరియు సంతాపం

    ఈ నెలకు సంబంధించిన ఇంకో దారి తప్పిన ఆచారం ఏమిటంటే సయ్యదినా హుస్సైన్ రదియల్లాహు అన్హు షహాదత్ కు జ్ఞాపకంగా శోకం మరియు సంతాపం ప్రకటించే సభలు, సమావేశాలు జరపటం. ఇంతకు ముందు తెలిపినట్లుగా కర్బలా సంఘటన, ఇస్లామీయ చరిత్రలోని అత్యంత దు:ఖకరమైన ఘటనలలో ఒకటి. కాని ఎవరైనా మరణించినప్పుడు, వారి చనిపోయిన రోజున సంతాప సభలు జరపటాన్ని ప్రవక్త (శల్లల్లాహు అలైహి వసల్లమ్) నిషేదించినారు. అజ్ఞానకాలంలో (ప్రవక్త ముహమ్మద్ శల్లల్లాహు అలైహి వసల్లమ్ కు పూర్వం) ప్రజలు చనిపోయినవారి గురించి బిగ్గరగా ఏడుస్తూ, బట్టలు చింపుకుంటూ & చెంపలపై, రొమ్ముపై గట్టిగా బాదుకుంటూ సంతాపం ప్రకటించేవారు. ఇటువంటి దురలవాట్లు, దురాచారాలు చేయవద్దని ప్రవక్త (శల్లల్లాహు అలైహి వసల్లమ్) ముస్లింలను వారించారు. మరియు సహనంతో, ఓర్పుతో "ఇన్నలిల్లాహి వ ఇన్న ఇలైహి రాజివూన్" అని పలకమని బోధించారు. దు:ఖసమయాలలో ఓర్పుతో ఇటువంటి ఉత్తమమైన జీవిత విధానాన్నే అనుసరించాలని అనేక హదీథ్ లు తెలుపుతున్నాయి. వాటిలో ఉదాహరణగా ఇదే విషయానికి సంబంధించిన ఒక హదీథ్ ను పరిశీలించుదాము - "ఎవరైతే తన చెంపలపై కొట్టుకుంటాడో, తన బట్టలు చింపుకుంటాడో మరియు అజ్ఞానకాలపు ప్రజల వలే రోదిస్తాడో, అతడు మా బృందంలోని వాడు కాజాలడు." (సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథం)

    ఇస్లామీయ ధర్మవేత్తలందరూ ఆఁషురాహ్ రోజున ఇటువంటి సంతాప విధానాన్ని అస్సలు అనుమతించలేదు. ఇంకా తన మరణం తర్వాత దు:ఖించవద్దని తన సోదరి సయ్యిదా జైనబ్ రదియల్లాహు అన్హా ను, తన ఆఖరి ఘడియలలో సయ్యదినా హుస్సైన్ రదియల్లాహు అన్హు స్వయంగా వారించారు. వారి మాటలలో "నా ప్రియతమ సోదరీ! ఒకవేళ నేను మరణిస్తే, నీవు నీ బట్టలను చింపుకోనని, నీ ముఖాన్ని గీకుకోనని, ఎవరి పైననూ నా గురించి శాపనార్థాలు పెట్టవని మరియు చావు కోసం నీవు వేడుకోవని నీ తరుపున నేను వాగ్దానం చేస్తున్నాను" (అల్ కామిల్, ఇబ్నె కథీర్ vol. 4 pg. 24)

    ఏ పుణ్యపురుషుల కోసమైతే దు:ఖిస్తున్నారో వారే ఇటువంటి సంతాప ప్రకటనా విధానాలను స్వయంగా ఖండించారని పైన తెలుపబడిన సయ్యదినా హుస్సైన్ రదియల్లాహు అన్హు యొక్క అంతిమ ఉపదేశంతో స్పష్టమవుతున్నది. కాబట్టి ప్రతి ముస్లిం ఇటువంటి సంప్రదాయాలను, ఆచరణలను వదిలి, ప్రవక్త (శల్లల్లాహు అలైహి వసల్లమ్) మరియు వారి ప్రియతమ మనవడు సయ్యదినా హుస్సైన్ రదియల్లాహు అన్హు యొక్క బోధనలను, సరైన ఇస్లామీయ జీవన విధానాలను స్థిరంగా, నిలకడగా ఆచరించవలెను.