షాఅబాన్ నెల 15వ తేదీ ఉపవాసం పాటించ వలసి ఉన్నదా?
కూర్పులు
Full Description
ఏదైనా ఆరాధన గురించి ప్రచారంలో ఉన్న హదీథు బలహీనమైనదని తెలిసినా దానిని ఆచరించటానికి ఇస్లాం ధర్మం అనుమతినిస్తున్నదా? హదీథు ఇలా తెలుపుతున్నది: “ఎప్పుడైతే షాఅబాన్ నెల మధ్యకు చేరుకున్నారో, ఆ రాత్రి ప్రార్థనలలో గడపండి మరియు ఆ దినమున ఉపవాసం ఉండండి." ఈ ఉపవాసం ఇష్టపూర్వకంగా అల్లాహ్ కు సమర్పించిన భగవదారాధనగా మరియు ఆ రాత్రి ఆరాధనలో గడిపినట్లుగా (ఖియాముల్లైల్ గా) పరిగణింపబడును.
అల్హందులిల్లాహ్.
మొట్టమొదట:
షాఅబాన్ నెల 15వ తేదీన ప్రత్యేకంగా నమాజులు చేయటం, ఉపవాసం పాటించటం మరియు ఆరాధనలు చేయటం లోని శుభాల గురించి తెలుపుతున్న ఉల్లేఖనలు బలహీనమైన (దయీఫ్) హదీథుల కోవలోనికి రావు, కానీ అవి కల్పితమైన (మౌదూ) హదీథుల మరియు అసత్యపు (బాతిల్) హదీథుల కోవలోనికి వస్తాయి. కాబట్టి అది మంచి ఆరాధనగా కనబడుతున్నా సరే, దానిని అనుసరించటానికి లేదా ఆచరించటానికి ఇస్లాం అనుమతినివ్వటం లేదు.
అనేక మంది పండితులు ఆ హదీథులకు సంబంధించిన వ్యాఖ్యానాలను అసత్యమైనవిగా ప్రకటించారు. ఉదాహరణకు – అల్ మౌదూఆత్ 2/440-445 అనే పుస్తకంలో ఇబ్నె అల్ జౌజీ, అల్ మనార్ అల్ మునీఫ్ no. 174- 177 అనే పుస్తకంలో ఇబ్నె అల్ ఖయ్యూమ్, అల్ బాఇథ్ అలా ఇంకార్ అల్ బిదాఅ వల్ హవాదిథ్ అనే పుస్తకంలో 124-137 అనే పుస్తకంలో అబూ షమా అష్షాఫయీ, మరియు తఖ్రీజ్ ఇహయా ఉలూమ్ అద్దీన్ no. 582 అనే పుస్తకంలో అల్ ఇరాఖీ. అంతేకాక ఇవి అసత్యపు హదీథులని పండితులు ఏకీభవించినట్లు షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియాహ్ తన మజ్మూ అల్ ఫతావా 28/138 అనే పుస్తకంలో నమోదు చేసినారు.
హుకుమ్ అల్ ఇహ్తిఫాల్ బి లైలత్ అన్నిస్సఫ్ మిన్ షాఅబాన్ అనే ఫతావాలో షేఖ్ ఇబ్నె బాజ్ ఇలా తెలిపినారు:
మెజారిటీ పండితుల అభిప్రాయం ప్రకారం - షాఅబాన్ నెల 15వ తేదీ రాత్రి ప్రత్యేక నమాజులు చేస్తూ విశేషంగా గడపటం లేదా ఈ దినాన్ని ప్రత్యేకంగా ఉపవాసం ఉండటానికి ఎన్నుకోవటం అనేది దురాచారము వంటి కల్పిత ఆచరణ (బిదాఅ) క్రిందికి వస్తుంది. దీనికి షరిఅత్ లో ఎలాంటి ఆధారాలు లేవు.
ఇంకా ఆయన ఇలా పలికారు:
షాఅబాన్ నెల 15వ తేదీ ప్రత్యేకంగా గడపటం గురించి ప్రామాణికమైన (సహీహ్) ఏ హదీథూ లేదు. దీని గురించి ప్రచారం చేస్తున్న హదీథులన్నీ ఎటువంటి ఆధారమూ లేని మౌదూ(అసత్యపు) మరియు దయీఫ్(బలహీనమైన) హదీథులు మాత్రమే. ఈ రాత్రిలో ఎటువంటి ప్రత్యేకతా లేదు. ఒంటరిగా లేదా సామూహికంగా ఈ రాత్రిలో ఖుర్ఆన్ పఠనం చేయటం గురించి గానీ లేదా నమాజులు చేయటం గురించి గానీ ఇస్లాం లో ఎటువంటి ఆదేశమూ లేదు. దీనిలో ప్రత్యేకత ఉన్నదని కొందరు పండితులు వెల్లడించిన అభిప్రాయాలు కేవలం బలహీనమైనవి. కాబట్టి ప్రత్యేక ఆరాధనల కొరకు ఈ రాత్రిని ఎన్నుకోవటం తగదు. ఇదే సరైన అభిప్రాయం. అల్లాహ్ యే శక్తిసామర్ధ్యాలకు మూలం. ఫతావా ఇస్లామీయహ్, 4/511. ఇంకా no. 8907 ప్రశ్నను కూడా చదవండి.
రెండవ విషయం:
ఒకవేళ ఆ హదీథును అసత్యపు (మౌదూ) హదీథుగా కాకుండా దానిని బలహీనమైన (దయీఫ్) హదీథుగా పరిగణించినా, పండితుల సరైన అభిప్రాయం ప్రకారం బలహీన (దయీఫ్) హదీథులను అస్సలు అనుసరించకూడదు. అవి మంచి ఆచరణల గురించి తెలుపుతున్నా సరే లేదా తర్గీబ్ మరియు తర్హీబ్ (వాగ్దానాలు మరియు హెచ్చరికల) గురించి తెలుపుతున్నా సరే. ప్రామాణిక హదీథులు అంటే సహీహ్ హదీథులు మనకు చాలు. ముస్లింలు బలహీనమైన (దయీఫ్) హదీథులను అనుసరించవలసిన అవసరం లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి లేక ఆయన సహచరుల (సహాబాల) నుండి ఈ రాత్రి లేదా ఈ పగలు ప్రత్యేకమైనదని తెలిపే ఆధారాలేమీ ఇస్లాం లో లేవు.
అహ్మద్ షాకిర్ అనే పండితుడు ఇలా పలికెను: ఫతావాలు (నియమాలు) లేదా మంచి ఆచరణల మధ్య భేదం ఏమీ లేదు – వీటిలో దేనినీ మనం బలహీనమైన (దయీఫ్) హదీథుల నుండి తీసుకోకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉల్లేఖించబడినదనే సరైన ప్రామాణికాధారాలు (సహీహ్ లేదా హసన్ హదీథులు) లేకుండా ఏదైనా హదీథును సాక్ష్యంగా చూపే హక్కు ఎవరికీ లేదు. అల్ బయీథ్ అల్ హదీథ్, 1/278. మరింత సమాచారం కోసం, అల్ ఖౌల్ అల్ మునీఫ్ ఫీ హుకుమ్ అల్ అమల్ బిల్ హదీథు అద్దయీఫ్ చదవండి.
ఇంకా no. 44877. ప్రశ్నకు ఇవ్వబడిన సమాధానాలు కూడా చూడగలరు. అల్లాహ్ యే అన్నీ ఎరిగినవాడు.