×
రజబ్ నెలలో కొందరు కల్పించిన నూతన పోకడల గురించి ఈ ఖుత్బా ప్రసంగంలో సవివరంగా చర్చించబడెను.

    అల్హందులిల్లాహ్ – సకల స్తోత్రములు అల్లాహ్ కొరకే.

    “నీ ప్రభువు తాను కోరిన దానిని సృష్టిస్తాడు మరియు ఎన్నుకుంటాడు” ఖుర్ఆన్ 28:68

    ఎంచుకొనుట మరియు ఎంపిక చేసుకొనుట అనే లక్షణాలు అల్లాహ్ యొక్క సార్వభౌమత్వాన్ని మరియు ఏకత్వాన్ని, ఆయన యొక్క పరిపూర్ణ వివేకాన్ని మరియు శక్తిసామర్ధ్యాలను సూచిస్తాయి.

    అల్లాహ్ యొక్క కార్యాలలోని ఒక వాస్తవ విషయం ఏమిటంటే ఆయన కొన్ని దినాలను మరియు నెలలను తన ఇష్ట ప్రకారం ఎన్నుకొని, వాటికి మిగిలిన వాటిపై ప్రత్యేకతను ప్రసాదించినాడు. నెలలలో, నాలుగింటిని ఎన్నుకుని, వాటిని పవిత్రమైనవిగా అల్లాహ్ ప్రకటించినాడు. ఈ విషయం గురించి దివ్యఖుర్ఆన్ (9:36)లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు – “యథార్థం ఏమిటంటే, ఆకాశాన్నీ, భూమినీ అల్లాహ్ సృష్టించిన నాటి నుండీ, మాసాల సంఖ్య అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. వాటిలో నాలుగు నిషిద్ధ మాసాలు. ఇదే సరియైన గణన పద్ధతి. కనుక వీటిలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి.....” చంద్రుడి కదలికలను బట్టి ఈ నెలల లెక్కింపు జరుగును. అంతేకాని, సత్యతిరస్కారులు లెక్కిస్తున్న సూర్యుడి కదలికలను బట్టి కాదు.

    దివ్యఖుర్ఆన్ లో పవిత్ర మాసాలు సూచనప్రాయంగా ప్రస్తావించబడినాయి, కాని వాటి పేర్లు తెలుప బడలేదు. వాటి పేర్లు సున్నహ్ లో (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలలో) తెలుపబడెను. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం గ్రంథాలలో నమోదు చేయబడిన ఒక హదీథులో అబు బక్రహ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన హజ్జ్ వీడుకోలు ఉపన్యాసంలో ఇలా ప్రకటించినారు “సమయం తన ఋతుచక్రాన్ని పూర్తి చేసుకున్నది మరియు అది అల్లాహ్ భూమ్యాకాశాలను సృష్టించినప్పుడు ఎలా ఉండినదో, ఇప్పుడు ఆ విధంగానే ఉన్నది. సంవత్సరానికి పన్నెండు నెలలు, వాటిలో నాలుగు పవిత్రమైనవి, మూడు ఒకదాని వెంబడి మరొకటి వరుసగా వచ్చే నెలలు – దుల్ ఖాయిదహ్, దుల్ హజ్జ్ మరియు ముహర్రమ్, ఇంకా ముదార్ యొక్క రజబ్ నెల - ఇది జుమా్ మరియు షఅబాన్ నెలల మధ్యన వస్తుంది. ”

    ఈ నెల ‘ముదార్ యొక్క రజబ్ నెల’ని ఎందుకు అనబడినదంటే ముదార్ వంశీయులు ఈ నెల వచ్చే క్రమాన్ని మార్చేవారు కాదు. కానీ, ఇతర అరబ్బు జాతులు ఈ నెల క్రమాన్ని వారుండే యుద్ధస్థితిని బట్టి మార్చేసేవారు. ఈ విషయం గురించి దివ్యఖుర్ఆన్ (9:37)లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “వాయిదా వేయటమనేది (పవిత్ర నెలలను) అవిశ్వాసంలో ఒక అదనమైన అవిశ్వాసపు చేష్ట, దాని ద్వారా ఈ అవిశ్వాసులు మార్గభ్ర,ష్టతకు గురిచెయ్యబడతారు. ఒక సంవత్సరం ఒక మాసాన్ని ధర్మ సమ్మతం చేసుకుంటారు, మరొక సంవత్సరం దానినే నిషిద్ధం చేసేస్తారు, అల్లాహ్ నిషిద్ధం చేసిన మాసాల సంఖ్యను పూర్తి చెయ్యాలనీ, అల్లాహ్ నిషిద్ధం చేసిన దానిని ధర్మసమ్మతం చేసుకోవాలని కూడా – వారి దుష్కార్యాలు వారికి మనోహరమైనవిగా చెయ్యబడ్డాయి. అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు.”

    ముదర్ జాతి వారు ఈనెలను ఎక్కువగా గౌరవించటం మరియు ఘనమైదిగా పరిగణించటం వలన వారి జాతిపేరు ఈ నెలతో జతచేయబడినదని కొందరు ప్రజలు అంటారు.

    ఈ నెలకు రజబ్ అనే పేరు ఎలా వచ్చినది?

    ఇబ్నె ఫారిస్ ఇలా పేర్కొన్నారు “ఈ పేరు యొక్క మూలాక్షరాలు - ‘ర’ ‘జీమ్’ మరియు ‘బ’. వీటితో ఏర్పడే మూలపదం ‘ఒకదానితో మరొక దానికి ఊతనివ్వటాన్ని, సమర్థించటాన్ని’ సూచిస్తుంది. కాబట్టి ‘రజబతుల్ షైయ్’ అంటే ‘నేను దీనిని గౌరవప్రదమైనదిగా బలపరుస్తున్నాను’ అని అర్థం. ఈ నెలను ప్రజలు రజబ్ అని పిలిచేవారు, ఎందుకంటే దీనిని వారు గౌరవప్రదమైనదిగా పరిగణించేవారు. అంతేకాక షరిఅహ్ (ఇస్లామీయ ధర్మశాసనం) లో కూడా ఇది గౌరవప్రదమైన నెలగానే నిర్ణయించబడినది.”

    అజ్ఞాన కాలంలో ప్రజలు దీనిని ‘రజబ్ మునస్సిల్ అల్ అసిన్నహ్’ (పదునైన ఆయుధాల మొనలు తొలగించటానికి కారణమయ్యేది) అని పిలిచేవారు. దీని గురించి సహీహ్ బుఖారీ గ్రంథంలో అబు రజా అల్ అతరీదీ అనే వ్యక్తి ఉల్లేఖించిన ఒక హదీథులో ఇలా నమోదు చేయబడినది – “మేము ఏదైనా రాయిని పూజిస్తుండగా, దాని కంటే మేలైన ఇంకో రాయి కనబడితే, ముందు పూజిస్తున్న రాతిని ప్రక్కకు విసిరేసి. క్రొత్తగా కనబడిన దానిని పూజించటం మొదలు పెట్టేవారము. ఒకవేళ మాకు ఏ రాయీ కనబడకపోతే, మేము మట్టితో ఒక చిన్న గుట్టను తయారుచేసి, దాని వద్దకు ఒక ఆడగొర్రెను తెచ్చి, ఆ గుట్టపై దాని పాలను పితికి, ఆ తరువాత దాని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారము. ఎప్పుడైతే రజబ్ నెల వచ్చేదో, మేము ‘మునస్సిల్ అల్ అసిన్నహ్’ అని అనే వారము. మరియు రజబ్ నెలలో ఇనుప ముక్కతో కూడిన బరిసెల, బాణాల లోహపు భాగం వేరుచేసి, ప్రక్కన పెట్టకుండా వదిలి పెట్టేవారము కాదు. ”

    ఈ నెల గురించి అల్ బైహఖీ ఇలా పేర్కొన్నారు “అజ్ఞాన కాలపు ప్రజలు ఈ పవిత్ర నెలలను ఎంతో గౌరవించేవారు, ముఖ్యంగా రజబ్ నెలను. మరియు ఈ నెలలో వారు యుద్ధాలు చేసేవారు కాదు.”

    రజబ్ ఒక పవిత్రమైన నెల

    పవిత్రనెలలకు ఒక ప్రత్యేక స్థానమున్నది. ఇది రజబ్ నెలకు కూడా వర్తిస్తుంది. దీని గురించి దివ్యఖుర్ఆన్ (5:2)లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ఓ విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ యొక్క సూచనల పవిత్రతను మరియు పవిత్ర నెలలను ఉల్లఘించకండి.”

    దీని అర్థం ఏమిటంటే అల్లాహ్ వేటినైతే పవిత్రమైనవిగా ఆదేశించినాడో, వాటి పవిత్రతను ఉల్లఘించకండి. అలా ఉల్లంఘించటాన్ని అల్లాహ్ నిషేధించినాడు. నీచమైన పాపిష్టి పనులు మరియు దుష్టవిశ్వాసాలు కూడా ఈ నిషేధంలోనికి వస్తాయి.

    దివ్యఖుర్ఆన్ (9:36)లోని “....కనుక వీటిలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి.....” వీటిలో అంటే ‘ఈ పవిత్ర నెలలలో’ అని అర్థం. ఖుర్ఆన్ ప్రఖ్యాత వివరణకర్త ఇబ్నె జరీర్ అత్తబరీ తెలిపినట్లుగా ‘వీటిలో’ అనే సర్వనామము ‘ఈ నాలుగు పవిత్ర నెలలను’ సూచిస్తున్నది.

    కాబట్టి, మనం ఈ నాలుగు నెలల పవిత్రను గౌరవించటంలో శ్రద్ధ చూపాలి. ఎందుకంటే అల్లాహ్ వాటికి ప్రత్యేక స్థానమిస్తూ మిగిలిన నెలల నుండి వేరుపరచిాడు. ఈ పవిత్ర స్థితి కారణంగా వీటి గౌరవార్థం ఈ నెలలలో పాపపు పనులు చేయటాన్ని అల్లాహ్ నిషేధించినాడు. అల్లాహ్ ఈ సమయాన్ని పవిత్రమైనదిగా చేయటం వలన, ఈ నెలలలో చేసే పాపాలు చాలా తీవ్రమైనవిగా పరిగణింపబడతాయి. కాబట్టి, పైన పేర్కొనబడిన ఖుర్ఆన్ ఆయత్ లో (వచనంలో) అల్లాహ్ ఈ సమయాన్ని విశేషమైనదిగా తెలియజేసినాడు. ఇంకా మనపై మనం స్వయంగా అన్యాయం చేసుకోవటాన్ని - అంటే పాపాలు చేయటాన్ని, అవి అన్ని కాలాలలో నిషేధింపబడినవే అయినా ఈ సమయంలో మరీ ప్రత్యేకంగా నిషేధించినాడు.

    ఈ పవిత్ర నెలలలో పోరాటం, యుద్ధం చేయటం

    దివ్యఖుర్ఆన్ (2:217) లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు “పవిత్రనెలలో యుద్ధం చేయటం గురించి వారు నిన్ను ప్రశ్నిస్తారు. వారితో ఇలా అను: వాటిలో యుద్ధం చేయటం ఒక ఘోరమైన (అపరాధం, ఉల్లంఘన, అతిక్రమణ, పాపం)... ”

    అధికశాతం పండితులు పవిత్ర మాసాలలోని యుద్ధ నిషేధం ఖుర్ఆన్ లోని “పవిత్ర నెలలు వెళ్ళిన తరువాత, ముష్రికులు మీకు ఎక్కడ కనబడితే అక్కడ చంపవలెను” అనే ఈ (9:5) వచనం ద్వారా మరియు సాధారణ రూపంలోని సత్యతిరస్కారులతో పోరాడమనే ఆదేశాలతో కూడిన ఇతర వచనాలు, ఉపదేశాల ద్వారా రద్దు చేయబడినదని అంటున్నారు.

    అయితే మరికొందరు పండితులు ఇలా అంటున్నారు: ఈ పవిత్ర నెలలలో పోరాటాలు ప్రారంభించటానికి అనుమతి లేదు. కాని, ముందు నుండే జరుగుతున్న పోరాటాన్ని కొనసాగించేందుకు మరియు వేరే సమయంలో ప్రారంభమైన పోరాటాన్ని సమాప్తం చేసేవిధంగా పోరాడటానికి అనుమతి ఉంది. తాయిఫ్ ప్రజలపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన యుద్ధాన్ని ఇదే విధంగా వివరించటం జరిగినది. ఎందుకంటే ఆ యుద్ధం హునైన్ అనే ప్రాంతంలో షవ్వాల్ నెలలో ప్రారంభమైనది.

    పై నిషేధం తమను తాము కాపాడుకోవటానికి స్వయం రక్షణ కోసం చేసే యుద్ధానికి వర్తించదు. ఒకవేళ శత్రువు ముస్లిం దేశాలపై దాడి చేస్తే, తమను తాము కాపాడుకోవటం ఆ దేశస్థులపై విధిగా చేయబడినది. ఆ దాడి పవిత్రనెలలో జరిగినా లేక వేరే నెలలో జరిగినా సరే.

    అల్ అతీరహ్ (ఒక రకమైన పశుబలి)

    అజ్ఞానపు కాలంలో అరబ్బు ప్రజలు రజబ్ నెలలో తమ తమ విగ్రహాలకు పశుబలి సమర్పించడాన్ని ఒక ఆరాధనగా భావించేవారు. అయితే ‘పశుబలి కేవలం అల్లాహ్ కే సమర్పించాలి’ అనే ఆదేశాన్ని ఇస్లాం ధర్మం ప్రకటించిన తరువాత, అజ్ఞాన కాలపు ఆ ఆచరణ రద్దయిపోయినది. రజబ్ నెలలో చేసే ఖుర్బానీల గురించి పండితులలో భేదాభిప్రాయం ఉన్నది. అల్ అతీరహ్ అనే పశుబలి రద్దయి పోయినదని హనఫీ, మాలికీ మరియు హంబలీ పండితులలో చాలా మంది ప్రకటించారు. వారి ఈ ప్రకటనకు మూలాధారం - సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీథు గ్రంథాలలో నమోదు చేయబడిన అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన “ఫిర్ లేదు మరియు అతీరహ్ లేదు” అనే హదీథు.

    అయితే అల్ అతీరహ్ రద్దుచేయబడలేదని షాఫయీ పండితులు తెలిపారు మరియు దానిని ముస్తబహ్ అంటే చేస్తే ఉత్తమం అని అభిప్రాయపడుతున్నారు. ఇబ్నె సిరీన్ అభిప్రాయం కూడా ఇదే.

    ఇబ్నె హజర్ ఇలా తెలుపుతున్నారు: “దీనికి ఆధారం నుబైషహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీథు, దేనిలోనైతే ఇలా ఉల్లేఖించబడినదో: ‘ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ప్రశ్నించాడు; మేము అజ్ఞాన కాలంలో రజబ్ నెలలో అల్ అతీరహ్ అనే పశుబలి సమర్పించేవారము. దీని గురించి మీ ఆదేశం ఏమిటి?’ సమాధానంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: ‘బలి దానం సమర్పించండి, అది ఏ నెల అయితేనేమి’”

    ఇబ్నె హజర్ ఇలా తెలుపుతున్నారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానిని సైద్ధాంతికంగా రద్దు చేయలేదు, కానీ ప్రత్యేకంగా రజబ్ లో ఈ బలిదానం చేయటమనే ఆలోచనను ఆయన రద్దు చేసారు.”

    రజబ్ లో ఉపవాసం

    రజబ్ నెలలో ఉపవాసం పాటించవలసిన ప్రత్యేకత గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి గాని లేదా సహాబాల నుండి గాని ఏ విధమైన ప్రామాణిక రిపోర్టూ లేదు. రజబ్ నెలలో పాటించే సోమవారం - గురువారం, చంద్రమాన నెల మధ్య పాటించే అల్ బీద్ అనబడే మూడు దినాలు, రోజు విడిచి రోజు పాటించే మరియు సిరార్ అల్ షహర్ ఉపవాసాలు కూడా మిగిలిన ఇతర నెలలోని ఉపవాసాల వంటివే. సిరార్ షహర్ ఉపవాసం అంటే నెలారంభంలో ఉండే ఉపవాసాలని కొందరు పండితులు తెలిపారు. ఇంకొందరు నెల మధ్యలో లేదా నెలాఖరున ఉండే ఉపవాసాలని తెలిపారు. అజ్ఞాన కాలపు అలవాట్లతో పోలి ఉండటం వలన రజబ్ నెలలో ఉపవాసం ఉండటాన్ని ఉమర్ రదియల్లాహు అన్హు నిషేధించేవారు. ఖరషహ్ ఇబ్నె అల్ హర్ర్ ఇలా ఉల్లేఖించారు – “రజబ్ నెలలో ఉపవాసం పాటిస్తున్న వారి చేతులను ఉమర్ రదియల్లాహు అన్హు ఆహారం వద్దకు స్వయంగా తీసుకువెళ్ళేవారు మరియు ఆయన ఇలా అనేవారు ‘అజ్ఞానకాలంలో ఈ నెలకు పుణ్యమైన నెలగా ప్రత్యేక స్థానమివ్వబడేది.’”

    ఇమాం ఇబ్నె అల్ ఖయ్యిమ్ ఇలా తెలిపారు: “కొందరు ఉపవాసం పాటిస్తున్నట్లుగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరుసగా మూడు నెలలలో (రజబ్, షఅబాన్ మరియు రమదాన్ లలో) ఉపవాసం పాటించలేదు మరియు రజబ్ నెలలో ఆయన అస్సలు ఉపవాసం పాటించనూ లేదు మరియు ఇతరులను ఉపవాసం పాటించమని ప్రోత్సహించనూ లేదు. ”

    అల్ హాఫిజ్ ఇబ్నె హజర్ ఇలా తెలిపారు: “రజబ్ నెల ప్రాధాన్యత లేదా ఈ నెల ఉపవాసపు ప్రాధాన్యత లేదా ఈ నెలలోని ఏదైనా ప్రత్యేక భాగంలో ఉపవాసపు ప్రాధాన్యత లేదా ఈ నెలలో ప్రత్యేకంగా ఖియాముల్లైల్ (రాత్రి నమాజుల) ప్రాధాన్యత గురించి సాక్ష్యంగా ఉపయోగించగలిగే ఏ సహీ హదీథూ ఉల్లేఖించబడలేదు. ఇమాం అబూ ఇస్మాయీల్ అల్ హరవీ అల్ హాఫిజ్ నా కంటే ముందుగానే ఈ విషయం గురించి తెలిపి ఉన్నారు మరియు ఈ అభిప్రాయాన్నే ఇతర పండితుల నుండి కూడా మేము సేకరించి, తెలిపి ఉన్నాము”

    రజబ్ నెలలో ఉమ్రా

    ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రజబ్ నెలలో ఉమ్రా చేయలేదని తెలుపుతున్న హదీథు సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీథు గ్రంథాలలో ఇలా నమోదు చేయబడినది – ముజాహిద్ ఇలా ఉల్లేఖించారు: “ఉర్వహ్ ఇబ్నె అల్ జుబైర్ మరియు నేను మస్జిదులోనికి ప్రవేశించాము. ఆ సమయంలో అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఆయెషా రదియల్లాహు అన్హా గది దగ్గర కూర్చుని ఉన్నారు. అప్పుడు ఎవరో ఆయనను ‘ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్ని సార్లు ఉమ్రా చేసారు?’ అని ప్రశ్నించగా, ఆయన ఇలా జవాబిచ్చారు ‘నాలుగు సార్లు మరియు వాటిలో ఒకటి రజబ్ నెలలో’ అది విన్న మేము ఆయనతో వాదించ దలుచుకోలేదు, ఆయెషా రదియల్లాహు అన్హా తన గదిలో మిస్వాక్ తో పళ్ళు తోముకుంటున్న శబ్దం స్పష్టంగా మాకు వినిపిస్తుండగా, ఉర్వహ్ ఇలా పలికారు: “ఓ విశ్వాసుల తల్లీ! అబూ అబ్దుర్రహ్మాన్ ఏమంటున్నారో మీరు వినలేదా?”. ఆవిడ ఇలా బదులిచ్చారు: “అతను ఏమన్నారు?” దానికి ఉర్వహ్ ఇలా పలికారు “అతను ఇలా అంటున్నారు – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాలుగు సార్లు ఉమ్రా చేసారు, వాటిలో ఒకటి రజబ్ నెలలో”. అది విని ఆవిడ ఇలా పలికారు: “అబూ అబ్దుర్రహ్మాన్ పై అల్లాహ్ కరుణించుగాక! అతను సాక్ష్యంగా లేకుండా (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం) ఏనాడూ ఉమ్రా చేయలేదు (అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్రా చేసిన ప్రతిసారీ అతను వారితో ఉన్నారు) మరియు ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం) రజబ్ నెలలో ఏనాడూ ఉమ్రా చేయలేదు.”

    సహీహ్ ముస్లిం హదీథు గ్రంథంలో ఇంకా ఇలా నమోదు చేయబడినది – ఇబ్నె ఉమర్ ఇది విని అవునని గాని లేదా కాదని గాని అనలేదు. అన్నవావి ఇలా పలికినారు: “తన మాటలను ఆయెషా సరిదిద్దినప్పుడు ఇబ్నె ఉమర్ నిశ్శబ్దంగా ఉండి పోవటం అనే విషయం ద్వారా తెలుస్తున్నదేమిటంటే – అతను అయోమయంలో పడిపోయినారు లేదా మరచిపోయినారు లేదా దాని గురించి అతనికి దృఢమైన అభిప్రాయం లేకపోయినది”. కాబట్టి ఉమ్రా చేయటం కోసం రజబ్ నెలను ప్రత్యేకంగా ఎన్నుకోవటమనేది మరియు రజబ్ నెలలో చేసే ఉమ్రాకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నదని నమ్మటమనేది ఇస్లాం ధర్మంలో బయలుదేరిన ఒక కల్పితాచారం (బిదఆ). అంటే ‘ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రజబ్ నెలలో ఉమ్రా అస్సలు చేయలేదు’ అనే విషయం తప్ప మరేమీ ఉల్లేఖించిబడలేదు.

    షేఖ్ అలీ ఇబ్నె ఇబ్రాహీమ్ అల్ అత్తార్ ఇలా తెలిపినారు: ‘మక్కా (అల్లాహ్ ఆ నగర గౌరవాన్ని ఇంకా ఉన్నత పరచుగాక) ప్రజల గురించి నేను విషయాలలో ఒక విషయం ఏమిటంటే, రజబ్ నెలలో వారు తరచుగా ఉమ్రా చేస్తుంటారు. నాకు తెలిసిన నిరాధారమైన విషయాలలో ఇది ఒకటి. ఈ విషయం గురించి నాకు తెలిసిదేమిటంటే ఒక హదీథులో నమోదు చేయబడిన విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “రమదాన్ నెలలో చేసే ఉమ్రా హజ్జ్ కు సమానము”

    షేఖ్ ముహమ్మద్ ఇబ్నె ఇబ్రాహీం ఇలా తెలిపినారు: ‘రజబ్ నెలలోని కొన్ని దినాలను ఏదైనా పుణ్యకార్యం కోసం ప్రత్యేకించటం, జియారహ్ (కాబాగృహాన్ని దర్శించటం) లేదా ఇంకేదైనా ఆచరణకు ఎటువంటి ఆధారమూ లేదు. ఎందుకంటే, ఇమాం అబూ షామహ్ తన ‘అల్ బిదఆ వల్ హవాదిథ్’ అనే గ్రంథంలో ఇలా తెలిపినారు: షరిఅహ్ లో తెలుపని విధంగా ప్రత్యేక సమయాలలో ఆరాధనా కార్యాలను ప్రత్యేకించటమనేది తప్పుడు పని; సాధారణంగా ఏ సమయాన్నైనా ఇతర సమయాల కంటే ఉన్నతమైనదిగా పరిగణించకూడదు కానీ కొన్ని సమయాలలో ఆచరించే కొన్ని ఆరాధనా పద్ధతులకు షరిఅహ్ ఇచ్చిన ప్రత్యేకత లేదా ఏదైనా సమయంలో చేసే పుణ్యకార్యం ఇతర సమయాలలో చేయటం కంటే ఉత్తమమైనదని షరిఅహ్ తెలిపి ఉంటే తప్ప.’ కాబట్టి, తరచుగా ఉమ్రా చేయటం కోసం రజబ్ నెలలను ప్రత్యేకించటాన్ని పండితులు ఖండించినారు.

    కానీ, ఉమ్రా చేయటానికి తనకు అనుకూలమని అతను ఎన్నుకున్న ఆ సమయం యాధృచ్ఛికంగా రజబ్ నెలతో ఏకీభవించిన కారణంగా రజబ్ నెలలో ఉమ్రా చేయటానికి ఎటువంటి ప్రత్యేకతా లేదు అని నమ్ముతూ ఎవరైనా ఆ నెలలో ఉమ్రా చేయటానికి వెళ్ళితే, దానిలో ఎటువంటి తప్పూ లేదు.

    రజబ్ నెలలోని స్వయం కల్పితాలు

    ధర్మంలో నూతన కల్పితాలు కల్పించటమనేది అల్లాహ్ యొక్క దివ్యగ్రంథానికి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ కు వ్యతిరేకమైన చాలా గంభీరమైన విషయం. ఇస్లాం ధర్మం పరిపూర్ణం కాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించలేదు. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు “..... ఈ దినమున నేను మీ కోసం నేను మీ ధర్మాన్ని పరిపూర్ణం చేసాను, నా అనుగ్రహాలను పూర్తి చేసాను మరియు ఇస్లాం ను మీ ధర్మంగా ఎంపిక చేసాను” 5:3

    సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం గ్రంథాలలో నమోదు చేయబడిన ఒక హదీథులో ఆయేషా రదియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు: “ఎవరైతే మా విషయంలో లేని విధానాలను నూతనంగా కల్పిస్తారో ఆటువంటి వారు మాలోని వారు కారు. అవి (వారు కల్పించిన విధానములు) తిరస్కరించబడును”

    సహీహ్ ముస్లిం గ్రంథంలో నమోదు చేయబడిన ఒక హదీథులో ఇలా తెలుపబడినది: “ఎవరైనా మా విధానములో లేని విషయాన్ని దేనినైనా ఆచరించినట్లయితే, అది తిరస్కరించబడును.”

    కొందరు ప్రజలు రజబ్ నెలలో అనేక నూతన పోకడలను, కల్పితాలను సృష్టించారు, వాటిలో కొన్ని....

    1. సలాతుల్ రగాయిబ్: ఈ రకమైన నమాజు పద్ధతి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన మొదటి మరియు ఉత్తమ శతాబ్దాల తరువాత ముఖ్యంగా నాలుగవ శతాబ్దం దరిదాపులలో బాగా వ్యాపించినది. కొందరు అసత్యవాదులు రజబ్ నెలలోని మొదటి రాత్రి ఈ నమాజు చేయాలనే విధానాన్ని నూతనంగా కల్పించినారు. షేఖుల్ ఇస్లాం ఇబ్నె తయిమియా ఇలా తెలిపినారు: “అల్ మాలిక్, అష్షాఫయీ, అబూ హనీఫా, అథ్థూరీ, అల్ ఔజాయీ, అల్ లైథ్ మరియు ఇతర పండితుల అభిప్రాయం ప్రకారం సలాతుల్ రగాయిబ్ అనేది ఒక బిదఆ. దీని ప్రాధాన్యతను వివరిస్తున్న హదీథు అసత్యమైనదని హదీథు శాస్త్ర పండితులందరి ఏకాభిప్రాయం.”

    2. ఈ నెలలో అనేక ప్రధాన సంఘటనలు జరిగాయని కొందరి అభిప్రాయం. అయితే వారి అభిప్రాయాలలో వేటికీ సరైన ఆధారాలు లేవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రజబ్ నెలలోని మొదటి రాత్రిన జన్మించారని మరియు ప్రవక్తగా ఈ నెల 27వ తేదీన లేక 25వ తేదీన నియమింపబడినారని కొందరి అభిప్రాయం. వీటిలో ఏదీ ప్రామాణికమైనది కాదు. ఎందుకంటే ఈ హదీథులో తెలుపబడిన హదీథు ఉల్లేఖకుల పరంపరలోని అల్ ఖాసిం ఇబ్నె ముహమ్మద్ తెలిపిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అల్ ఇస్రా అనబడే రాత్రి ప్రయాణం ఈనెల 27వ తేదీన జరిగినదనే విషయం ప్రామాణికమైనది కాదు. దీనిని ఇబ్రాహీం అల్ హరబీ మరియు ఇతరులు తిరస్కరించినారు. 27వ తేదీన మేరాజ్ గాథను చదవటం మరియు ఉత్సవాలు జరపటం, ఇంకా ఈ రాత్రి నఫిల్ నమాజులు, పగటి పూట ఉపవాసం పాటించటం అదనపు ఆరాధనల కోసం ప్రత్యేకించటం మొదలైనవి ఈ నెలలో మొదలైన ఇంకో రకమైన కల్పితాచారములు. ఈ రాత్రి జరిపే ఇంకొన్ని సంఘటనలలో ఇస్లాం ధర్మపు రెండు ముఖ్య పండుగలలో కూడా అనుమతింపబడని విధంగా స్త్రీపురుషుల కలిసిమెలిసి గడపటం, పాటలు పాడటం, సంగీత కచేరీలు చేయటం మొదలైన నిషేధింపబడిన హరామ్ పనులు కూడా ఉన్నాయి. ఇస్లాం ధర్మంలో అస్సలు లేని ఇటువంటి ప్రోగ్రాములను కొందరు దారితప్పిన వారు కావాలని మన సమాజంలో నూతనంగా కల్పించినారు. అంతేకాక, ఇస్రా మరియు మేరాజ్ ఇదే తేదీన జరిగినదనే దానికి కూడా ఎలాంటి ప్రామాణికతా లేదు. ఒకవేళ ఇదే తేదీన ఇస్రా-మేరీజ్ జరిగినదని ఏదోవిధంగా నిరూపించబడినా, ప్రత్యేకంగా ఆ దినమున ఉత్సవాలు జరపటమనేది క్షమింపబడని విషయం. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో, ఆయన సహాబాల (సహచరుల) కాలంలో, ముందు తరం ముస్లింల కాలంలో ఇలాంటి ఉత్సవాలు జరపేవారు అనటానికి ఎలాంటి ఆధారమూ మనకు లభించదు. ఒకవేళ ఇలా చేయటం మంచి విషయమైతే మనకంటే ముందుగా ఆ పుణ్యపురుషులే వీటిని మొదలు పెట్టి ఉండేవారు. ఇస్లాం ధర్మాన్ని సరిగ్గా గ్రహించటంలో అల్లాహ్ మనకు సహాయం చేయుగాక.

    3. రజబ్ నెలలో చేసే సలాతుల్ దావూద్ అనే నమాజులకు కూడా ఎలాంటి ఆధారమూ లేదు.

    4. రజబ్ నెలలో ప్రత్యేకంగా చదివే దుఆలు కూడా కల్పితమైనవే.

    5. ఇంకా రజబ్ నెలలో ప్రత్యేకంగా సమాధులను సందర్శించడం కూడా కల్పితమైనదే. ఎందుకంటే సమాధులను సంవత్సరంలో ఎలాంటి భేదం లేకుండా ఏ దినమునైనా సున్నత్ పద్ధతి ప్రకారం సందర్శించవచ్చు.