భార్యాభర్తల పరస్పర హక్కులు మరియు బాధ్యతలు
కూర్పులు
Full Description
భార్యాభర్తల పరస్పర
హక్కులు మరియు బాధ్యతలు
﴿ حقوق الزوجين﴾
] తెలుగు – Telugu – تلغو [
Shaik Muhammad Saleh Al-Munajjid
అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విమర్శ : షేఖ్ నజీర్ అహ్మద్
2009 - 1430
﴿ حقوق الزوجين﴾
] తెలుగు – Telugu – تلغو [
الشيخ محمد صالح المنجد
ترجمة: محمد كريم الله
مراجعة: شيخ نزير أحمد
2009 - 1430
భార్యాభర్తల పరస్పర
హక్కులు మరియు బాధ్యతలు
ఖర్ఆన్ మరియు సున్నహ్ ల ఆధారంగా భార్యాభర్తల పరస్పర
హక్కులు మరియు బాధ్యతలు ఏమిటి ?
అల్హందులిల్లాహ్ – సకల స్తోత్రములు అల్లాహ్ కే.
ఇస్లాం ధర్మం భర్త పై భార్య యొక్క బాధ్యతను మరియు భార్య పై భర్త యొక్క బాధ్యతను విధించినది. అలాగే మరి కొన్ని బాధ్యతలను భార్యాభర్తలిద్దరి పైనా విధించినది.
అల్లాహ్ సహాయంతో మేము భార్యాభర్తల పరస్పర బాధ్యతలకు సంబంధించిన కొన్ని ఖుర్ఆన్ ఆయత్ (వచనాల)లను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలను(సున్నహ్ లను) మరియు కొందరు పండితుల అభిప్రాయాలను వివరించటానికి ప్రయత్నిస్తున్నాము.
మొదటిది: కేవలం భార్యకే చెందిన హక్కులు:
1. ఆర్థికపరమైన హక్కులు
a) మహర్ (వధుకట్నం):
b) ఖర్చులు - పోషణ:
c) సరైన వసతి:
2. ఆర్థిక పరమైనవి కాకుండా, వేరే ఇతర హక్కులు:
i. తోటి భార్యలతో సమానంగా చూడటం:
ii. తగిన స్థానమిచ్చి గౌరవంగా చూడటం:
iii. హాని కలిగించకుండా ఉండటం:
రెండవది: భార్యపై భర్తకు గల హక్కులు:
(a) భర్తకు విధేయత చూపటం:
(b) భర్తకు అందుబాటులో ఉండటం:
(c) భర్తకు అయిష్టమైనవారిని ఇంట్లోనికి అనుమతించక పోవటం:
(d) భర్త అనుమతితోనే అవసరమైనప్పుడు ఇంటి బయటికి వెళ్ళటం:
(e) భర్త క్రమశిక్షణలో ఉండటం:
(f) పతి సేవ:
(g) భర్తకు స్వయంగా సమర్పించుకోవటం:
(h) భర్తతో మంచిగా ప్రవర్తించటం:
మొదటిది: కేవలం భార్యకే చెందిన హక్కులు:
భార్యకు భర్త పై ఆర్థికపరమైన హక్కులు ఉన్నాయి. భర్త ఆవిడకు మహర్ అంటే వధుకట్నం ఇవ్వటం, ఆవిడ ఖర్చులు భరించడం, ఆవిడకు సరైన వసతి కల్పించడం మొదలైనవి. వాటితో పాటు భార్యకున్న ఇతర హక్కులు – ఆవిడను తోటి సవతులతో సమానంగా చూడటం, ఆవిడతో మంచిగా మరియు ఉత్తమంగా ప్రవర్తించటం, ఆవిడకు హాని కలిగించకుండా ఉండటం.
1. ఆర్థికపరమైన హక్కులు:
(a) మహర్ (వధుకట్నం): ఇది పెళ్ళి జరిగే సమయంలో లేదా శోభన సమయంలో భర్త నుండి భార్య పొందవలసి ఉన్న కట్నం. దీనిని తప్పని సరిగా ప్రతి భర్త తన భార్యకు ఇవ్వవలసి ఉన్నది. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “(పెళ్ళి చేసుకోబోయే) స్త్రీలకు మంచి మనస్సుతో వారి మహర్ ను చెల్లించండి.” [అన్నిసా 4:4]
మహర్ అంటే పెళ్ళి సమయంలో భర్త తన భార్యకు ఇచ్చే వధుకట్నం. మహర్ విధించటమనేది వివాహబంధంలోని సీరియస్ నెస్ అంటే తీవ్రతను మరియు ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది. ఇంకా ఇది స్త్రీలకు లభిస్తున్న గౌరవం మరియు సన్మానం వంటిది.
అధికశాతం పండితుల అభిప్రాయం ప్రకారం మహర్ అనేది వివాహ బంధానికి తప్పని సరైన షరతు లేదా అతి ముఖ్యమైన భాగం కాదు. కాని ఇది వివాహబంధపు పర్యవసానాలలో ఒకటి. ఇస్లామీయ పండితుల ఏకాభిప్రాయం ప్రకారం ఒకవేళ మహర్ ప్రకటించకుండానే వివాహం జరిగినా, ఆ పెళ్ళి ఆమోదయోగ్యమైనదే. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “స్పర్శించక ముందే (శోభనం కంటే ముందే) మరియు వారి యొక్క వధుకట్నాన్ని నిర్ణయించకుండానే ఒకవేళ మీరు మీ స్త్రీలకు విడాకులు ఇచ్చినట్లయితే మీ పై ఎటువంటి పాపమూ లేదు.” [అల్ బఖరహ్ 2:236]
శోభనం కంటే ముందు లేదా మహర్ చెల్లించక ముందు విడాకులు ఇవ్వటానికి అనుమతి ఉన్నది అనే వాస్తవం ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే నిఖా సమయంలో మహర్ చెల్లించకుండా ఆలస్యం చేయటానికి అనుమతి ఉన్నది.
ఒకవేళ వివాహ(నిఖా) ఒప్పందంలో మహర్ వ్రాసినట్లయితే, అది భర్త పై తప్పని సరి అయిపోవును. ఒకవేళ వ్రాయకపోతే, సమాజంలోని తన భార్య స్థాయిని తగ్గ ఇతర మహిళల మహర్ కు సమానమైన మహర్ ను ఆవిడకు ఇవ్వవలెను.
(b) ఖర్చులు - పోషణ: ‘భర్త తన భార్య ఖర్చులు భరించటం తప్పని సరి’ అనేది ఇస్లామీయ పండితులందరి ఏకాభిప్రాయం. దీనికున్న ఒకే ఒక షరతు ఏమిటంటే, భార్య భర్తకు అందుబాటులో ఉండటం, పిలిచినప్పుడు అనుకూలంగా స్పందించటం. ఒకవేళ ఆవిడ భర్తను తిరస్కరిస్తున్నా లేక భర్త పై తిరుగుబాటు చేస్తున్నా, భర్త నుండి తన ఖర్చులు పొందే హక్కును కోల్పోతుంది.
పెళ్ళి ఒప్పందం (నిఖా) ప్రకారం ఆవిడ కేవలం తన భర్తకే అందుబాటులో ఉండవలసి ఉన్నది. దీని కారణంగా భర్త తన భార్యను పోషించటం తప్పని సరి అగును. భర్త అనుమతి లేకుండా భార్య తన సంసార గృహాన్ని వదిలి బయటకు వెళ్ళటమనేది నిషేధించబడినది. కాబట్టి భార్య ఖర్చులను భర్త భరించటం తప్పనిసరి, మంచిగా పోషించటం తప్పనిసరి. దీనికి బదులుగా భార్య ఎల్లప్పుడూ తన భర్త కోరికలు తీర్చటానికి అందుబాటులో ఉండవలసి ఉన్నది.
భార్యను పోషించటమంటే (ఖర్చులు భరించటమంటే) ఆవిడకు సమంజసమైన రీతిలో భోజన సదుపాయాలు మరియు వసతి సౌకర్యాలు కల్పించటం. భార్య ధనవంతురాలైనా సరే ఆ ఖర్చులను భర్త నుండి పొందే పూర్తి హక్కు ఆవిడకు ఉన్నది. ఎందుకంటే ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “కాని బిడ్డ తండ్రి, (ఆ బిడ్డ) తల్లి యొక్క భోజనసదుపాయాల మరియు దుస్తుల ఖర్చులు సమంజసమైన రీతిలో (రీజనబుల్) భరించవలసి ఉన్నది.” [2:233]
“ధనవంతుడు తనకు అనుకూలమైన రీతిలో ఖర్చు పెట్టవలెను; మరియు ఎవరి సంపాదనైతే తక్కువగా ఉన్నదో, వారు తమకు అల్లాహ్ ప్రసాదించిన దానిలో నుండే ఖర్చు పెట్టవలెను.” [అత్తలాఖ్ 65:7]
సున్నహ్ నుండి:
భర్త తనపై ఖర్చు పెట్టడం లేదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఫిర్యాదు చేసిన అబూ సుఫ్యాన్ రదియల్లాహు అన్హు భార్య హింద్ బిన్తె ఉత్బా కు ఆయన ఇలా ఉపదేశించినారు: “సమంజసమైన రీతిలో నీకు మరియు నీ పిల్లలకు అవసరమైనంత ధనాన్ని (ఆయన జేబులో నుండి) తీసుకో.”
ఆయేషా రదియల్లాహు అన్హా ఉల్లేఖించిన హదీథ్ లో ఇలా ఉన్నది: “అబూ సుఫ్యాన్ భార్య అయిన హింద్ బిన్తె ఉత్బా రసూలుల్లాహ్ వద్దకు వచ్చి, ఇలా పలికెను, ‘ఓ రసూలుల్లాహ్ (అల్లాహ్ యొక్క ప్రవక్తా), అబు సుఫ్యాన్ నా పై మరియు నా పిల్లలపై ఖర్చు పెట్టని ఒక పిసినారి మనిషి. ఆయనకు తెలియకుండా ఖర్చుల కోసం నేను ఆయన ధనంలో నుండి కొంత తీసుకుంటూ ఉంటాను. అలా చేయటం వలన నాపై ఏమైనా పాపం ఉంటుందా?’ దానికి జవాబుగా రసూలుల్లాహ్ ఇలా పలికినారు, ‘నీకు మరియు నీ పిల్లలకు సరిపడేటంత ధనం మాత్రమే ఆయన సంపద నుండి తీసుకో, ఇది సమంజసంగా ఉండవలెను (అవసరాలకు మించి తీసుకోకూడదు)’” (బుఖారీ, ముస్లిం హదీథ్)
తన అంతిమ హజ్జ్ ప్రసంగంలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన విషయాన్ని జాబిర్ రదియల్లాహు అన్హు ఒక హదీథ్ లో ఇలా ఉల్లేఖించినారు: “స్త్రీల విషయంలో అల్లాహ్ కు భయపడండి! అల్లాహ్ యొక్క రక్షణలో మీరు వారిని తీసుకున్నారు. వారితో సంభోగించటం అల్లాహ్ యొక్క సందేశాల ఆధారంగా ధర్మబద్దం చేయబడినది. మీకు కూడా వారిపై హక్కులు ఉన్నాయి, మీరు ఇష్టపడని వారెవ్వరినీ మీ పరుపు పై కూర్చోనివ్వరాదు[అంటే ఇంటిలోనికి అనుమతించ కూడదు]. కాని ఒకవేళ వారలా చేస్తే, మీరు వారిని శిక్షించండి, కాని తీవ్రంగా కాదు. మీ పై వారికున్న హక్కులు ఏమిటంటే, వారి భోజనసదుపాయాలు, దుస్తులు సమంజసమైన రీతిలో మీరు సమకూర్చటం.” (ముస్లిం హదీథ్ )
(c) సరైన వసతి: ఇది కూడా భార్య హక్కులలోని ఒక ముఖ్యమైన హక్కు. దీని అర్థం - భర్త తన తాహతును, స్థాయిని బట్టి భార్యకు సరైన వసతి కల్పించవలసి ఉన్నది. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “మీరు నివసించే చోట మీకు అనుకూలమైన విధంగా వారికి వసతి కల్పించండి” [అత్తలాఖ్ 65:6]
2. ఆర్థిక పరమైనవి కాకుండా, వేరే ఇతర హక్కులు:
(i) తోటి భార్యలతో సమానంగా చూడటం: భార్యలకు తమ భర్త పై ఉన్న ఇంకో హక్కు ఏమిటంటే, ఒకవేళ భర్తకు ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉన్నట్లయితే, రాత్రులు గడపటంలో, ఖర్చు పెట్టడంలో, పోషించటంలో, దుస్తులు కొనటంలో వారందరినీ సమంగా చూడవలసి ఉన్నది.
(ii) తగిన స్థానమిచ్చి గౌరవంగా చూడటం: భర్త తన భార్యలతో ఉత్తమంగా ప్రవర్తించవలెను. వారిపై దయ చూపవలెను. తన వైపు త్రిప్పుకోవటానికి, వారి హృదయాలను మెత్తపరచటానికి అవసరమైన ప్రతిదీ ఇవ్వవలెను. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “మరియు వారితో గౌరవంగా జీవించండి” [అన్నిసా’ 4:19]
“మరియు తమపై ఉన్న హక్కులకు మాదిరిగా, వారికీ సమంజసమైన హక్కులున్నాయి.” [అల్ బఖర 2:228]
సున్నహ్ నుండి:
ఒక హదీథ్ లో అబూహురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధించినారు: ‘స్త్రీలతో స్నేహపూర్వకంగా ప్రవర్తించండి.’” (బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు).
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన భార్యలతో ఎంతో స్నేహపూర్వకంగా, దయతో వ్యవహరించేవారని ఆయన జీవితంలోని అనేక ఉదాహరణలు నిరూపిస్తున్నాయి:
1. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య ఉమ్మె సలమ తెలిపిన విషయాన్ని జైనబ్ బిన్తె అబి సలమ ఇలా ఉల్లేఖించినారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో నేను ఒకే ఉన్ని దుప్పటి క్రింద పడుకుని ఉన్నప్పుడు నాకు నెలసరి బహిష్టు మొదలైనది. అప్పుడు నేను మెల్లగా (దుప్పిటిలో నుండి) జారుకుని, బహష్టు వచ్చినప్పుడు ధరించే దుస్తులు ధరించినాను. అది చూసి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ‘నీకు బహిష్టు మొదలైనదా?’ అని అడుగగా, ‘అవును’ అని నేను జవాబిచ్చినాను. అప్పుడు ఆయన నన్ను తన దగ్గరకు పిలిచి, తనతో పాటు దుప్పటి క్రింద పడుకోవటానికి అవకాశమిచ్చినారు.”
జైనబ్ ఇంకా ఇలా పలికినారు: మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసం ఉన్నప్పుడు కూడా తనను ముద్దు పెట్టుకునే వారని, రతిసంభోగం తర్వాత పవిత్రమవటానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు తను కలిసి ఒకే పాత్ర నుండి గుసుల్ (స్నానం) చేసేవారమని ఆవిడ(ఉమ్మె సలమ) తెలిపినారు(బుఖారీ మరియు ముస్లిం హదీథ్)
2. ఆయేషా రదియల్లాహు అన్హా ఇలా తెలిపారని ఉర్వాహ్ ఇబ్నె అజ్జుబైర్ ఒక హదీథ్ లో ఇలా ఉల్లేఖించినారు: ‘అల్లాహ్ పై శపధం చేసి చెబుతున్నాను, మస్జిదె నబవీ వద్ద అబిసీనియన్లు బంతులాట ప్రదర్శిస్తున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా ఇంటి ద్వారం దగ్గర నిలబడి ఉన్నారు. ఆయన నాకు తోడుగా నిలబడి, తన దుస్తులలో నన్ను కప్పి, ఆ సర్కసును చూడటానికి అవకాశం ఇచ్చినారు. ఇక చాలు అని నేను అనేటంతటి వరకు ఆయన తన పనులను వదిలి నాతో నిలబడినారు. కాబట్టి యువతులకు సర్కసుల వంటి ఆటలను చూపించవచ్చు అనే వాస్తవాన్ని మీరు గ్రహించవలెను.’” (బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు)
3. ఒక హదీథ్ లో ఆయెషా రదియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కోసారి కూర్చొని నమాజు చేసేవారు, దానిలో ఖుర్ఆన్ పఠిస్తూ, దాదాపు 30 లేక 40 ఆయత్ మిగిలి ఉన్నప్పుడు లేచి నిలుచుని ఖుర్ఆన్ పఠించేవారు. ఆ తర్వాత రుకూలో వెళ్ళేవారు, ఆ తర్వాత సజ్దాలో వెళ్ళేవారు, అలాగే రెండో రకాతు పూర్తి చేసేవారు. ఆయన తన నమాజు పూర్తి చేసిన తర్వాత, నా వైపు చూసేవారు. ఒకవేళ నేను మేలుకుని ఉన్నట్లయితే, నాతో మాట్లాడేవారు. ఒకవేళ నేను నిద్రలో ఉంటే, తను కూడా పడుకునేవారు. బుఖారీ హదీథ్ గ్రంథం
(iii) హాని కలిగించకుండా ఉండటం:
ఇది ఇస్లాం యొక్క మూలసిద్ధాంతాలలో ఒక ముఖ్యమైన మూలసిద్ధాంతం. అపరిచితులకు హాని కలిగించటమే చాలా ఘోరమైన పాపం, మరి జీవిత భాగస్వామి అయిన తన స్వంత భార్యకు హాని కలిగించటమనేది చాలా చాలా ఘోరమైన పాపం.
ఉబాదాహ్ ఇబ్నె అస్సామిత్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు, “ఇతరులకు హాని కలిగించకూడదు మరియు బదులుగా హాని కలిగించకూడదు” (ఇబ్నె మాజా హదీథ్) దీనిని ప్రామాణికమైనది గా ఇమాం అహ్మద్, అల్ హాకిమ్, ఇబ్నె అస్సలాహ్ మరియు ఇతరులు వర్గీకరించినారు - ఖలసాత్ అల్ బదర్ అల్ మునీర్
న్యాయాధికారులు ఈ హదీథ్ నుండి తీసుకునే విషయం ఏమిటంటే, ఇతరులను కొట్టడం లేక తీవ్రంగా హింసించడం అనేది నిషేధింప బడినది.
తన అంతిమ హజ్జ్ ప్రసంగంలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన విషయాన్ని జాబిర్ రదియల్లాహు అన్హు ఒక హదీథ్ లో ఇలా ఉల్లేఖించినారు:
“స్త్రీల విషయంలో అల్లాహ్ కు భయపడండి! అల్లాహ్ యొక్క రక్షణలో మీరు వారిని తీసుకున్నారు. వారితో సంభోగించటం అల్లాహ్ యొక్క సందేశాల ఆధారంగా ధర్మబద్దం చేయబడినది. మీకు కూడా వారిపై హక్కులు ఉన్నాయి, మీరు ఇష్టపడని వారెవ్వరినీ మీ పరుపు పై కూర్చోనివ్వరాదు.[అంటే ఇంటిలోనికి అనుమతించ కూడదు]. కాని ఒకవేళ వారలా చేసినట్లయితే, మీరు వారిని శిక్షించండి, కాని తీవ్రంగా కాదు. మీపై వారికున్న హక్కులు ఏమిటంటే, వారి భోజనసదుపాయాలు, దుస్తులు సమంజసమైన రీతిలో మీరు సమకూర్చటం.” (ముస్లిం హదీథ్)
రెండవది: భార్యపై భర్తకు గల హక్కులు:
భార్యపై భర్తకు గల హక్కులు చాలా గొప్పవి; నిశ్చయంగా అతనికి ఆమె పై గల హక్కులు, ఆమెకు అతనిపై గల హక్కుల కంటే అధికమైనవి. ఎందుకంటే ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటించినాడు (భావం యొక్క అనువాదం): “మరియు తమపై వారికున్న (భర్తలకున్న) హక్కుల మాదిరిగానే వారు (స్త్రీలు) కూడా తమ భర్తలపై సమంజసమైన హక్కులు కలిగి ఉన్నారు, కాని పురుషులు వారిపై ఒక వంతు అధికమైన హక్కులు కలిగిఉన్నారు. [అల్ బఖరహ్ 2:228]
అల్ జసాస్ ఇలా తెలిపినారు: భార్యాభర్తలకు ఒకరి పై ఇంకొకరికి కొన్ని హక్కులు ఉన్నాయని, భార్యకు భర్తపై లేని ఒక ప్రత్యేక హక్కు భర్తకు ఉన్నదని, పై ఆయత్ (వచనం) లో అల్లాహ్ ప్రకటిస్తున్నడు.
ఇబ్నె అరబీ ఇలా తెలిపినారు:ఈ ప్రకటన తెలియజేస్తున్నదేమిటంటే వివాహబంధపు బాధ్యతలు మరియు హక్కులలో భార్య పై భర్తకు కొంత ఆధిక్యత ఉన్నది.
భార్యపై నున్న భర్త హక్కులు:
(a) భర్తకు విధేయత చూపటం: అల్లాహ్ స్త్రీల రక్షణ బాధ్యత, పోషణ బాధ్యత చూడమని పురుషుడికి ఆదేశించెను. ఎవరైనా తమ బాధ్యతలో ఉన్నవాటిని ఎలాగైతే తగిన జాగ్రత్తలు తీసుకుని మంచిగా కాపాడు కోవటానికి ప్రయత్నాస్తారో, అలాగే వారికి కూడా సరైన దారి చూపి, తగిన జాగ్రత్తలు తీసుకుని కాపాడమని ఆజ్ఞాపించెను. దీనికి కారణం అల్లాహ్ పురుషులకు మాత్రమే తగిన శారీరక మరియు మానసిక శక్తిసామర్థ్యాలు ప్రసాదించి, వారి చేతిలో ఆర్థికపరమైన బాధ్యతలను పెట్టెను. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (ఖుర్ఆన్ భావం యొక్క అనువాదం): “పురుషులు స్త్రీల సంరక్షకులు మరియు పోషకులు, ఎందుకంటే అల్లాహ్ వారిలో ఒకరికి ఇంకొకరిపై ఆధిక్యతను మరియు వారు తమ దగ్గరున్న దానిలో నుండి (వారిపై) ఖర్చుచేస్తారు.” [అన్నిసా 4:34]
‘ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన నుండి అలీ ఇబ్నె అబీ తల్హాహ్ ఇలా పలికినారు: “పురుషులు, స్త్రీల సంరక్షకులు మరియు పోషకులు” అంటే వారు స్త్రీల బాధ్యత వహించేవారు i.e., అల్లాహ్ ఆదేశించని విషయాలలో ఆవిడ అతనికి విధేయత చూపవలెను. అతని కుటుంబంతో మంచిగా ప్రవర్తించటం ద్వారా మరియు అతని సంపదను జాగ్రత్తగా కాపాడటం ద్వారా ఆవిడ అతనికి విధేయత చూపగలదు. ఇది ముఖౌతిల్, అస్సాది మరియు అద్దహాక్ ల అభిప్రాయం.(ఖుర్ఆన్ వ్యాఖ్యానకర్త - ఇబ్నె కథీర్)
(b) భర్తకు అందుబాటులో ఉండటం: భార్య నుండి శారీరకానందం పొందటమనేది భర్త హక్కులలోని ఒక ముఖ్యమైన హక్కు. ఒకవేళ అతను సంభోగం జరుప గలిగే స్త్రీని పెళ్ళి చేసుకున్నట్లయితే, వివాహ ఒప్పందపు నియమం ప్రకారం అతను పిలిచినప్పుడు ఆవిడ తనను తాను తప్పనిసరిగా సమర్పించు కోవలసి ఉన్నది. అయితే, ఆవిడకు చెల్లించవలసిన వధుకట్నాన్ని పూర్తిగా చెల్లించిన తర్వాతే ఈ నియమం వర్తిస్తుంది. ఇంకా ఆవిడ క్రొత్త పరిస్థితులకు అలవాటు పడటానికి కొంత సమయం అంటే 2 లేక 3 దినాల సమయం అడిగితే, దానిని ఇవ్వవలసి ఉంటుంది. అయినా అదేమంత ఎక్కువ సమయం కాదు కదా. ఇంకా అలా ఇవ్వటం ఆచారం కూడా.
ఒకవేళ భార్య తన భర్త సంభోగానికి పిలిచినప్పుడు, సరైన కారణం లేకుండా దానిని తిరస్కరించినట్లయితే, ఆవిడ హరాం పని చేసినట్లు మరియు ఘోరమైన పాపం చేసినట్లగును. ఇక్కడ సరైన కారణమంటే – బహిష్టు, తప్పని సరి ఉపవాసం (రమదాన్ ఉపవాసం), అనారోగ్యం మొదలైనవి.
అబు హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: ‘ఎవరైనా భర్త తన భార్యను పక్క మీదికి పిలిచినప్పుడు, ఆవిడ పక్క మీదకి రాక తిరస్కరించిటం వలన, కోపంతో అతను నిద్రపోతే, తెల్లవారే వరకు దైవదూతలు ఆమెను శపిస్తూ ఉంటాయి.’ (బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు)
(c) భర్తకు అయిష్టమైనవారిని ఇంట్లోనికి అనుమతించక పోవటం: భార్య పై భర్తకు ఉన్న ఇంకో హక్కు ఏమింటే, తను ఎవరినైతే ఇష్టపడడో, అటువంటి వారిని ఆవిడ అతని ఇంట్లోనికి రానివ్వకూడదు.
అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినట్లు తెలుపబడినది: “భర్త ఇంట్లో ఉన్నప్పుడు అతని అనుమతి లేకుండా ఉపవాసం ఉండటానికి లేదా ఇంట్లోకి ఎవరినైనా అనుమతించటానికి ఆవిడకు అనుమతి లేదు. మరియు అతని అనుమతి లేకుండా అతని సంపదలో నుండి ఖర్చుచేయటానికి కూడా” (బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు)
సులైమాన్ ఇబ్నె అమర్ ఇబ్నె అల్ ఆస్ ఇలా తెలిపినారు: నా తండ్రి హజ్జతుల్ విదా యాత్రలో తను కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు ఉన్నారని నాతో చెప్పి, ఇలా తెలియజేసారు - ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను స్తుతించి, ఆ తర్వాత ఇచ్చిన ఉపన్యాసంలో ఇలా బోధించారు: “స్త్రీలపై దయ చూపండి, వారు మీ బందీలో ఉన్నారు మరియు మీకు వారిపై అంతకంటే ఎక్కువ అధికారం లేదు. వారు గనుక బహిరంగంగా తిరుగుబాటు చేస్తే, వారిని పక్కల నుండి దూరం చేయండి, తీవ్రంగా కాకుండా చిన్నగా కొట్టండి. కాని వారు మరల విధేయత వైపు మరలితే, వారికి వ్యతిరేకంగా వంకలు వెతకకండి. మీకు మీ స్త్రీలపై హక్కులు ఉన్నాయి మరియు మీ స్త్రీలకు మీ పై కొన్ని హక్కులు ఉన్నాయి. మీకు వారిపై ఉన్న హక్కులు ఏమిటంటే మీరు ఇష్టపడని వారిని, మీ పరుపు పై కూర్చోవటానికి అనుమతించకూడదు మరియు మీరు ఇష్టపడని వారిని మీ ఇంట్లోనికి అనుమతింపకూడదు. మీపై వారికున్న హక్కు ఏమిటంటే, వారిని మంచిగా పోషించవలెను మరియు మంచి దుస్తులు ఇవ్వవలెను.” (అత్తిర్మిథి మరియు ఇబ్నె మాజా హదీథ్ గ్రంథాలు)
జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఇంకో హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని నమోదు చేయబడినది:
“స్త్రీల విషయంలో అల్లాహ్ కు భయపడండి! అల్లాహ్ యొక్క రక్షణలో మీరు వారిని తీసుకున్నారు. వారితో సంభోగించటం అల్లాహ్ యొక్క సందేశాల ఆధారంగా ధర్మబద్దం చేయబడినది. మీకు కూడా వారిపై హక్కులు ఉన్నాయి, మీరు ఇష్టపడని వారెవ్వరినీ మీ పరుపు పై కూర్చోనివ్వరాదు.[అంటే ఇంటిలోనికి అనుమతించ కూడదు]. కాని ఒకవేళ వారలా చేసినట్లయితే, మీరు వారిని శిక్షించండి, కాని తీవ్రంగా కాదు. మీపై వారికున్న హక్కులు ఏమిటంటే, వారి భోజనసదుపాయాలు, దుస్తులు సమంజసమైన రీతిలో మీరు సమకూర్చటం.” (ముస్లిం హదీథ్ గ్రంథం)
(d) భర్త అనుమతితోనే అవసరమైనప్పుడు ఇంటి బయటికి వెళ్ళటం: – భర్తకు భార్యపై గల మరొక హక్కు ఏమిటంటే, భార్య తన భర్త అనుమతి లేకుండా ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు.
షాఫయి మరియు హంబలి వర్గాలు ఇలా అభిప్రాయపడుతున్నాయి: భర్త అనుమతి లేకుండా భార్య అనారోగ్యంతో ఉన్న తన తండ్రి దగ్గరకు కూడా వెళ్ళకూడదు, అతనికి అలా ఆపటానికి పూర్తి హక్కు ఉన్నది. ఎందుకంటే భర్తకు విధేయత చూపటమనేది భార్యపై ఉన్న తప్పనిసరి విధి. కాబట్టి ఇస్లాంలో తప్పని సరి విధియైన పనిని నిర్లక్ష్యం చేసి తప్పని సరి కాని పని చేయటానికి అనుమతి లేదు.
(e) క్రమశిక్షణలో ఉండటం: – అవిధేయత చూపినప్పుడు భార్యను క్రమశిక్షణలో ఉంచే హక్కు భర్తకు ఉన్నది. అవిధేయత అంటే ఏదైనా ధర్మబద్ధమైన విషయాన్ని తిరస్కరించటం, అంతేకాని ఏదైనా చేయకూడని పాపపు పనులు, చెడుపనులు చేయమన్న ఆదేశాన్ని తిరస్కరించటం కాదు. అవిధేయత చూపని భార్యలను క్రమశిక్షణ లోనికి తీసుకరావటానికి, వారిని పడక నుండి కొంత కాలం వరకు దూరం చేయటానికి, చిన్నగా కొట్టడానికి అల్లాహ్ అనుమతి ఇచ్చినాడు.
హనఫీ వర్గం వారి అభిప్రాయం ప్రకారం నాలుగు సందర్భాలలో క్రమశిక్షణ కోసం తన భార్యను కొట్టడానికి అనుమతి ఉన్నది. అవి: తన కోరికను అనుసరించి అలంకరించుకోనప్పుడు; తను పక్కపై పిలిస్తే పరిశుభ్రంగా ఉండి కూడా పక్కపైకి రానప్పుడు; నమాజు చేయనప్పుడు; ఇంకా అనుమతి లేకుండా ఇంటి నుండి బయటకు పోయినప్పుడు.
భర్త భార్యను క్రమశిక్షణలో ఉంచటానికి ఇవ్వబడిన అనుమతి ఖుర్ఆన్ లోని ఈ క్రింది ఆయత్ లో ఉన్నది. (భావం యొక్క అనువాదం): “స్త్రీలలో చెడు నడత చూసినప్పుడు, వారిని మందలించ వలెను, పక్క నుండి దూరం చేయవలెను, కొట్టవలెను” [అన్నిసా 4:34]
“ఓ విశ్వాసులారా! మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని మనుషులు మరియు రాళ్ళు ఇంధనంగా ఉండే నరకాగ్ని నుండి కాపాడుకోండి” [అత్తహ్రీం 66:6]
ఇబ్నె కథీర్ ఇలా వివరించారు:
ఖుతాదా ఇలా తెలిపినారు: అల్లాహ్ కు విధేయత చూపమని మీరు వారిని ఆదేశించవలెను, అల్లాహ్ కు అవిధేయత చూపటాన్ని నిరోధించ వలెను; అల్లాహ్ యొక్క ఆదేశాలకనుగుణంగా మీరు వారి బాధ్యత వహించవలెను, మరియు అల్లాహ్ యొక్క ఆదేశాలు అనుసరించమని వారిని ఆదేశించవలెను, మరియు అలా చేయటంలో వారికి సహాయం చేయవలెను. ఒకవేళ మీరు వారిలో అల్లాహ్ వైపు ఏదైనా అవిధేయత చూసినట్లయితే, దాని నుండి వారిని ఆపవలెను మరియు మందలించ వలెను.
అద్దహాక్ మరియు ముఖాతిల్ తమ అభిప్రాయన్ని ఇలా తెలిపినారు: బంధువులు, బానిసలతో సహా తన కుటుంబసభ్యులందరికీ అల్లాహ్ ఆచరించమన్న వాటిని మరియు చేయవద్దని నిరోధించిన వాటిని బోధించటమనేది ప్రతి ముస్లిం యొక్క బాధ్యత. (Tafseer Ibn Katheer, 4/392)
(f) పతి సేవ: దీనికోసం అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. వాటిలో కొన్ని పైన పేర్కొనబడినవి.
షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియహ్ ఇలా తెలిపినారు:
సమాజంలోని తోటివారు సమంజసమైన రీతిలో చేస్తున్న విధంగా, ఆవిడ కూడా తన భర్తకు సపర్యలు, సేవలు చేయవలెను. పరిస్థితులను బట్టి ఎంత వరకు సేవ చేయాలనేది ఆధారపడి ఉంటుంది: ఒక పల్లెటూరి మహిళ తన భర్త చేసే సేవలకు మరియు ఒక పట్టణవాసి తన భర్తకు చేసే సేవలకు మధ్య తేడా ఉన్నది. అలాగే ఒక బలమైన స్త్రీ తన భర్తకు చేసే సేవలోను మరియు ఒక బలహీనమైన స్త్రీ తన భర్తకు చేసే సేవలెను భేదం ఉన్నది. (అల్ ఫత్వా అల్ కుబ్రా, 4/561)
(g) భర్తకు స్వయంగా సమర్పించుకోవటం: నిఖా పూర్తయిన తర్వాత అంటే ఇస్లామీయ ధర్మచట్టం ప్రకారం పెళ్ళి ఒప్పందపు అన్ని షరతులు - నియమ నిబంధలు పూర్తవగానే, పెళ్లికూతురు తన భర్తకు స్వయంగా సమర్పించుకోవలసి ఉన్నది. భర్త ఆనందం పొందటానికి, తనతో రతిసంభోగం జరపటానికి అనుమతించవలసి ఉన్నది. ఎందుకంటే, నిఖా అగ్రిమెంటు పూర్తవగానే, భర్త చెల్లించిన మహర్ కు బదులుగా అంటే వధుకట్నానికి బదులుగా ఆవిడ తనను అనుభవించటానికి అనుమతించవలసి ఉన్నది.
(h) భర్తతో మంచిగా ప్రవర్తించటం: ఎందుకంటే ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (భావం యొక్క అనువాదం): “తమపై వారికున్న సమంజసమైన హక్కుల (భార్యపై భర్తకు గల హక్కుల) మాదిరిగానే వారికీ (భార్యలకూ) హక్కులున్నాయి (తమ ఖర్చుల గురించి భర్తలపై)” [అల్ బఖరహ్ 2:228]
అల్ ఖుర్తుబి ఇలా వివరించెను:
ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనల నుండి, పై ఆయత్ వివరణ ఇలా ఉన్నది: ప్రేమాభిమానాలతో మరియు దయతో నిండిన, సమంజమైన రీతిలో ఉత్తమంగా ప్రవర్తించే మంచి సహచర్యం తన భర్త నుండి పొందే హక్కు భార్యకు ఉన్నది. దానికి బదులుగా ఆవిడ తన భర్తకు విధేయత చూపవలసి ఉన్నది, ఆయన మాటను తు.చ. తప్పక శిరసావహించవలసి ఉన్నది. మరియు భర్తలు తమకు హాని కలిగించకూడదనే హక్కు వారికి ఉన్నది మరియు అలాంటిదే హక్కు వారిపై భర్తలకు ఉన్నది. అత్తబరి అభిప్రాయం కూడా ఇదే.
ఇబ్నె జైద్ ఇలా వివరించెను: మీరు వారి గురించి అల్లాహ్ కు భయపడ వలెను. అలాగే వారు కూడా మీ గురించి అల్లాహ్ కు భయపడవలసి ఉన్నది.
పై ఇద్దరి అభిప్రాయాల అర్థాలు ఒకేలా ఉన్నాయి మరియు ఈ ఆయత్ లోపల వివాహబంధపు అన్ని రకాల బాధ్యతలు మరియు హక్కులు ఉన్నాయి. (అల్ ఖుర్తుబి ఖుర్ఆన్ తఫ్సీర్, 3/123-124) And Allaah knows best.
Sheikh Muhammed Salih Al-Munajjid