×
ఒక ముస్లిం షవ్వాల్ నెల 6 దినాల ఉపవాసాలను ఎప్పుడు ప్రారంభించాలి?

    ఒక ముస్లిం షవ్వాల్ నెల 6 దినాల ఉపవాసాలను ఎప్పుడు ప్రారంభించాలి?

    షవ్వాల్ నెల 6 దినాల ఉపవాసాలను నేనెప్పుడు ప్రారంభించాలి? మాకిప్పుడు వార్షిక సెలవులు ఉన్నాయి.

    అల్హందులిల్లాహ్ – సకల స్తోత్రములు మరియు కృతజ్ఞతలూ అల్లాహ్ కే.

    షవ్వాల్ నెల మొదటి తేదీన అంటే ఈదుల్ ఫిత్ర్ దినమున ఉపవాసం ఉండటం నిషేధించబడినది. కాబట్టి, షవ్వాల్ నెల రెండవ తేదీ నుండి మీరు 6 దినాల షవ్వాల్ ఉపవాసాలు ప్రారంభించవచ్చు. షవ్వాల్ నెలలో మీరు ఏ సమయంలోనైనా ఈ 6 దినాల ఉపవాసాలు పాటించవచ్చు. అయితే 'మంచి పనులలో ఉత్తమమైనవి – వాటి సమయం ఆరంభమవగానే ఆచరించబడిన మంచిపనులు' అనే విషయాన్ని గుర్తుంచుకోవలెను.

    స్టాండింగ్ కమిటీకి చేరిన ప్రశ్న:

    రమదాన్ మాసం పూర్తయి, ఈదుల్ ఫిత్ర్ పండుగ జరుపుకున్న వెంటనే షవ్వాల్ ఉపవాసాలు పాటించటం ప్రారంభించాలా లేదా పండుగ జరుపుకున్న తరువాత, షవ్వాల్ నెలలో కొన్ని దినాల గడిపి, ఆ తరువాత షవ్వాల్ ఉపవాసాలు ప్రారంభించటానికి అనుమతి ఉన్నదా?

    స్టాండింగ్ కమిటీ సమాధానం:

    ఈదుల్ ఫిత్ర్ జరుపుకున్న వెంటనే ఈ ఉపవాసాలు పాటించవలసిన అవసరం లేదు; పండుగ తరువాత ఒకటి, రెండు లేదా అనేక రోజులు ఆగి, ఆ తరువాత షవ్వాల్ ఉపవాసాలు పాటించడానికి అనుమతి ఉన్నది. తమ తమ సౌలభ్యాన్నీ, అనుకూలాన్నీ బట్టి. తమకు తేలికగా ఉండే విధంగా వీటిని షవ్వాల్ నెలలో నిరంతరంగా ప్రతి రోజూ లేదా వేర్వేరు దినాలలో అప్పుడప్పుడు ఉండవచ్చు. వీటిని పూర్తిచేయడంలో చాలా సౌలభ్యం కలుగజేయబడింది. ఇవి తప్పని సరిగా పాటించవలసిన విధి ఉపవాసాలు (ఫర్ధ్ ఉపవాసాలు) కావు - ఇవి సున్నత్ ఉపవాసాలు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయాన్ని అనుసరించి పాటించబడే ఉపవాసాలు.

    అల్లాహ్ యే మన శక్తిసామర్ధ్యాలకు మూలాధారం. అల్లాహ్ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మరియు ఆయన కుటుంబాన్ని మరియు ఆయన సహచరులను దీవించుగాక!

    ఫతావా అల్ లజ్నహ్ అల్ దాయిమహ్, 10/391